ఆదివారం కూడా ఎన్నికల కమీషనర్ ఆక్టివ్ గా పని చేస్తున్నారు. ఈ రోజు మొదటి విడత ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు కావటంతో, సందడి సందడి నెలకొంది. అయితే ఆన్లైన్ నామినేషన్ల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపద్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసారు. ఇందులో పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల విషయంలో, నామినేషన్ వేసే అభ్యర్ధులు, ఆన్లైన్ లో నామినేషన్ పంపితే స్వీకరించాలని, గతంలో ఆదేశాలు ఇచ్చాం అని చెప్పి, ఆ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులని ప్రశ్నించారు. పలు రాజకీయ పక్షాలు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే, ఆన్లైన్ లో నామినేషన్ల స్వీకరణ ఉండాలని, ఎన్నికల కమిషన్ ను అభ్యర్ధించాయి. దీనికి స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆ విషయం పై పరిశీలిస్తామని కూడా, చెప్పింది. తరువాత ఈ మేరకు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసారు. ఆన్లైన్ లో నామినేషన్లు స్వీకరించే కార్యక్రమం చేపట్టాలని, దీని వల్ల ప్రశాంత పరిస్థితి ఉంటుందని, ప్రశాంతంగా ఆన్లైన్ లోనే నామినేషన్లు వేసుకుంటారని పేర్కొన్నారు.
కానీ ఈ ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎందుకు అమలు చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు కొంత మంది ఎన్నికల నామినేషన్ వేయకుండా, అవకాసం లేకుండా పోయిందని, ఎన్నికలు అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై, ఎన్నికల కమిషన్ పై ఉందని, పోటీ చేయాల్సిన వారు, పోటీ చేయకుండా పొతే, అది ప్రజాస్వామ్యం కాదని, అందులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే, రేపు ఉదయం 10 గంటలకు ఈ విషయం పై చర్చించటానికి తన వద్దకు రావాలని, ఆదేశాలు జరీ చేసారు. రేపు పంచాయతీ రాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎలక్షన్ కమిషన్ వద్దకు వచ్చి, దీని పై వివరణ ఇచ్చే అవకాసం ఉంది. ఇది అత్యవసరంగా భావించాలని, రేపు రావాలని కోరారు. రేపు రెండో దశకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రెండో దశకు అయినా, ఆన్లైన్ నామినేషన్లో తీసుకునే అవకాసం అందుబాటులోకి వచ్చే అవకాసం ఉంది. ఇక రేపు హైకోర్టులో కూడా ఎస్ఈసి వేసిన హైకోర్టు ధిక్కరణ కేసు కూడా విచారణకు రానుంది.