ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు విభజన హామీల పై స్పష్టత లేదు. గట్టిగా అడిగిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టి పక్కన పడేసారు. మెడలు వంచేసి సాధిస్తా అని చెప్పిన జగన్, ఏమి చేస్తున్నారో ప్రజలు చూసారు. ఇక ఏపి ప్రజలు కూడా, తమ రాష్ట్రం గురించి పట్టించుకునే స్థాయిలో లేరు. అన్నీ కలిసి వచ్చిన అంశాలు అని అనుకున్నారో ఏమో కానీ, ఆంధ్రుల పోరాటానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి, రాష్ట్రంలో అందోళన మొదలైంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూ, ముందు ఉంది. టిడిపి నేత పల్లా, దీక్ష కూడా చేసారు. ఇక తాము ఎక్కడ వెనుకబడిపోతామో అని విజయసాయి రెడ్డి చేత పాదయాత్ర ప్లాన్ చేస్తుంది వైసీపీ. అయితే ముందు ఉండి కేంద్రంతో పోరాడాల్సిన వైసీపీ, ఢిల్లీలో ఏమి మాట్లాడకుండా, ఇక్కడ హడావిడి చేస్తున్నారు. అయితే అసలు కేంద్రం ఏపికి ఏది కావాలి అంటే, కావలసిన దాని కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది అని ప్రచారం చేసిన బీజేపీ నేతలు ఈ విషయంలో వెనుకబడ్డారు. ఇది కేంద్రం నిర్ణయం కావటం , ఎప్పటిలాగే చంద్రబాబు మీద ఎదురు దాడి చేసి తప్పించుకోవటం ఈ విషయంలో బీజేపీ కుదరలేదు.
అందుకే ఉద్యమంలోకి రాకుండా, మేము ఢిల్లీ వెళ్లి, కేంద్రాన్ని ఒప్పిస్తాం అంటూ, సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పటి వరకు అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరకలేదు. ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికే అవకాశమే లేదు. అందుకే నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, ఏదో హడావిడి చేయాలని భావించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని నడ్డాతో చెప్తూ ఉండగా, ఈ విషయం తనకు చెప్పవద్దు అంటూ నడ్డా సున్నితంగా తిరస్కరించారు. పార్టీకి సంబందించిన విషయాలు మాట్లాడాలని, ప్రభుత్వానికి సంబందించిన విషయాలు, ఆయా కేంద్ర మంత్రుల వద్దే ప్రస్తావించాలని నడ్డా చెప్పటంతో, సోము వీర్రాజు షాక్ అయ్యారు. మరో సారి, ఇది ఏపి ప్రజల సెంటిమెంట్ అదీ ఇదీ అని చెప్తూ ఉండగా, తాను ఈ విషయంలో ఏమి చెయలేను అని, ప్రభుత్వ విషయాల్లో తన జోక్యం ఉండదు అని, పార్టీ విషయాలు మాత్రమే చెప్పాలని మరోసారి స్పష్టం చేసారు. దీంతో సోము వీర్రాజు అండ్ టీం, ఈ రోజు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. గత మూడు రోజులుగా దొరకని అపాయింట్మెంట్ ఈ రోజు అయినా దొరికితే, కనీసం మీడియాలో చెప్పుకోవటానికి అయినా బీజేపీ నేతలకు ఉంటుంది.