ఈ రోజు మునిసిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచే మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారు. అయితే సరిగ్గా ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. గతంలో ఇదే ఎన్నికల కమీషనర్, ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని, అసాధారణ రీతిలో ఏకాగ్రీవాలు జరిగాయని, కేంద్ర హోం శాఖకు లేఖ రాసారు. అయితే ఇప్పుడు ఆ బలవంతపు ఏకగ్రీవాల పై మాత్రం, ఏమి స్పందించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడో ఏడాది క్రితం జరిగిన నోటిఫికేషన్, అసలు ఇప్పటి వరకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇవి పార్టీ సింబల్ తో జరిగే ఎన్నికలు అని, ఏడాది క్రితం ఒక పార్టీలో ఉన్న వారు, ఇప్పుడు వేరే పార్టీకి మారి ఉంటే పరిస్థితి ఏంటి ? అభ్యర్ధి మరణిస్తే పరిస్థితి ఏంటి ? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, బలవంతపు ఎకగ్రీవాలు. దీని పై ఏమి తేల్చకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం ఎలా తీసుకుంది అని ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. మాచర్లలో మొత్తం ఏకగ్రీవం అయ్యాయని, అసలు అది ఎలా సాధ్యమో ఎలక్షన్ కమిషన్ చెప్పాలని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పై, కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి.
తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి, గన్ని కృష్ణ స్పందిస్తూ, "మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ గతసంవత్సరం ఎక్కడ ఆపామో అక్కడినుండే కొనసాగుతాయని.. అంటే కొత్తగా నామినేషన్లు స్వీకరించడం జరగదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం ముమ్మాటికీ అధికారపార్టీకి అనుకూలమే! గత సంవత్సరం కరోనా మూలంగా స్థానికఎన్నికలను వాయిదా వేసిన సందర్భంలో ఇదే ఎన్నికల కమీషనర్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి లేఖ వ్రాస్తూ.. రాష్ట్రంలో ఎన్నికలు హిం-సా-త్మ-కం-గా మారాయని స్వేఛ్చగా నామినేషన్లు వేసే అవకాశం కూడాలేదని.. తనకూ తన కుటుంబానికి రక్షణ కూడా లేని పరిస్థితి ఏపీలో నెలకొందని పేర్కొనడాన్ని గుర్తు చేసికుంటే అటువంటి పరిస్థితులలో జరిగిన ఏకాగ్రీవాలను ఎలా కొనసాగిస్తూ నిర్ణయించారో ఎస్ ఈసీ కే తెలియాలి. తక్షణం రీనోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తం ఎన్నికల ప్రక్రియ తాజాగా మొదలుపెట్టాలని గతంలోని ఏకగ్రీవ ఎన్నికలను నామినేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని అన్నారు.