రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డికి షాకింగ్ న్యూస్ వినిపించింది కోర్టు. 2018లో పింక్ డైమెండ్ తిరుమల నుంచి మిస్ అయ్యిందని, దానికి సంబంధించి విదేశాల్లో దాన్ని విక్రయించారని రమణ దీక్షితులు చెప్పగా, అది చంద్రబాబు ఇంట్లో నేల మాలిగల్లో దాచారని విజయసాయి రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి, రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు చేసారు. తన రిటైర్మెంట్ కు ముందు, ఈ రచ్చ చేయగా, పదవీ విరమణ అయిపోయిన వెంటనే, ఆయన్ను పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి రమణ దీక్షితులు పింక్ డైమెండ్ పై మరిన్ని విమర్శలు చేసారు. దానికి విజయసాయి రెడ్డి వంత పాడారు. అయితే రికార్డ్స్ లో మాత్రం, అసలు పింక్ డైమెండ్ అనేది లేదని, కొన్ని కమిటీలు తేల్చి చెప్పాయి. సుప్రీం కోర్టులో కూడా ఈ వ్యవహారం నడించింది. అయితే లేని పింక్ డైమెండ్ పై, రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి చేసిన రచ్చ పై, అప్పట్లోనే టిటిడి పాలకమండలి, ఇరువురి పై పరువు నష్టం దావా వేసారు. రామణ దీక్షితులు పై వంద కోట్లు, విజయసాయి రెడ్డి పై వంద కోట్లకు, టిటిడి పరువు నష్టం దావా వేసింది. దీని కోసం రెండు కోట్ల రూపాయులు స్టాంప్ డ్యూటీ చెల్లించి, తిరుపతి పదవ అదనపు జిల్లా కోర్టులో, పరువు నష్టం కేసు దాఖలు చేయటం జరిగింది. అయితే వైసిపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ కేసుని వెనక్కు తీసుకోవాలని, టిటిడి పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయం పై, కోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ఎవరికీ తెలియకుండా ఈ విత్ డ్రా చేయటం పై, పలువురి నుంచి అభ్యంతరాలు వచ్చాయి. హిందూ జనశక్తి అనే సంఘం దీని పై అభ్యంతరం చెప్పింది. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు, భక్తుల మనోభావాలు దెబ్బ తీసాయని, పరువు నష్టం కేసు విత్ డ్రా చేయటానికి వీలు లేదు, టిటిడి తప్పుకుంటే, తాము పార్టీగా చేరుతామని, పరువు నష్టం వసూలు చేయాలని కోర్టులో కేసు వేసారు. దీంతో ఈ కేసు పై, అందరికీ నోటీసులు ఇచ్చిన కోర్టు, అందరి అభిప్రాయం తీసుకుంది. అయితే హిందూ జనశక్తిని ఇందులో పార్టీని చేయకూడదు అని టిటిడి, దీక్షితులు, విజయసాయి కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు మాత్రం, వీరి వాదన పరిగణలోకి తీసుకోలేదు. హిందూ జనశక్తిని పార్టీని చేయటానికి కోర్టు ఒప్పుకుంది. పరువు నష్టం కేసు కొనసాగాబోతుంది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల ఒకటికి వాయిదా పడింది. పరువు నష్టం కేసు నుంచి తప్పించుకోవాలని చూసిన దీక్షితులు, విజయసాయి రెడ్డికి షాక్ తగిలింది.