రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది మార్చి 15వ తేదీన వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పట్లో పెద్ద ఎత్తున ఏకాగ్రీవాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు నేపధ్యంలోనే ఎన్నికల కమిషన్, మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు, కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అప్పట్లో ఎవరైతే ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో అటువంటి వాళ్ళు, మళ్ళీ నామినేషన్ వేయటానికి అవకాసం కల్పిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ నేపధ్యంలోనే అప్పుడు నామినేషన్ వేయలేని వారు, రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి కానీ, పోలీసులకు చేసిన ఫిర్యాదులు కానీ, లేదా నామినేషన్ వేయకుండా అడ్డుకున్న సంఘటనలు గురించి, మీడియాలో వచ్చిన ఫోటోలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఆధారాలు కానీ జిల్లా ఎన్నికల అధికారికి తీసుకుని వచ్చి అందిస్తే, వారిని మళ్ళీ అభ్యర్ధిగాను, మళ్ళీ నామినేషన్ వేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని, ఈ రోజు విడుదల చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. రెండు రోజుల క్రితం కూడా పురపాలక సంఘాల ఎన్నికల విషయంలో కూడా, ఇటువంటి అవకాశాన్ని అభ్యర్ధులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది.
మార్చ్ 14 వ తేదీతో పురపాలక సంఘాల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలోనే ఈ ఆదేశాలు ఇవ్వటంతో, మార్చి 14వ తేదీ లోపే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించిన రీ నోటిఫికేషన్ వచ్చే అవకాసం ఉందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. ఈ రోజు నుంచి 20వ తేదీ లోపు కలెక్టర్ లు అందరూ కూడా దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలని, ఈ లోపు అభ్యర్దులు రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి కానీ, తమ వద్ద ఉన్న ఆధారాలతో, ఆధారాలు అందిస్తే, నామినేషన్ ను పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.