ఒక పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పై, కారణం లేకుండా చర్యలు తీసుకోవటం పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. గత వారం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తిరుపతి పర్యటన నేపధ్యంలో, ఐఏఎస్ అధికారి బన్సల్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు స్వాగతం పలికి, దగ్గర ఉండి తిరుమల దర్శనం చేపించారు. అయితే ఆ తరువాత రోజే, ఆయన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆగ్రహానికి గురి అయ్యారు. ఆయన్ను వెంటనే బదిలీ చేసిన ప్రభుత్వం, చివరకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడిలో రిపోర్ట్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆయన నెల్లూరు జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిగా కూడా ఉన్నారు. కేవలం ఎలక్షన్ కమీషనర్ కు స్వాగతం పలికారని, ప్రభుత్వం ఇలా చేయటం పై, అందరూ షాక్ తిన్నారు. ఐఏఎస్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. అయితే ఇలాంటి చర్యలు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికార వర్గాలను, ప్రభుత్వం బెదిరింపు ధోరణికి నిదర్శనంగా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకోవటం పై,రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఇంకా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలు జరగాల్సి ఉండటం, అలాగే తరువాత మునిసిపల్ ఎన్నికలు కూడా ఉండటంతో, మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంది.
దీనికి సంబంధించి, నిన్న రాత్రి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ప్రభుత్వం, ఇష్టం వచ్చినట్టు బదిలీ చేయటం కుదరదు అంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. సాధారణ బదిలీలు అయితే ఒకే కానీ, ప్రభుత్వం కావాలని చేసే బదిలీలు మాత్రం, సరైన కారణం చెప్పి, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని, ఆ తరువాతే బదిలీ చేయాలని, ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇటీవల ఎన్నికల పరిశీలుకుడిని అకారణంగా బదిలీ చేసినట్టు తమ దృష్టికి వచ్చింది, ఇక ముందు ఇలా జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలని, తమ అనుమతి తీసుకున్న తరువాతే బదిలీలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇటీవల కాలంలో, అధికారుల పై, ఎన్నికలు అయిన తరువాత చర్యలు ఉంటాయి అంటూ వస్తున్న బెదిరింపులు పై కూడా స్పష్టత ఇస్తూ, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దీని పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అందరూ రాజ్యాంగం ప్రకారం పని చేయాలనీ, ఉద్యోగులకు భరోసా ఇచ్చింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్.