డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని, అదేవిధంగా ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని, అందుకు ఆయన్ని అభినందిస్తున్నానని, ఉన్నపళంగా సవాంగ్ గారికి వేంకటేశ్వరుడి పై భక్తి ఎందుకుపుట్టుకొచ్చిందో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "చంద్రబాబుపై కేసుపెట్టే అంశాన్ని న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని డీజీపీగారు చెప్పారు. చంద్రబాబు మతవిద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా డీజీపీగారు చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే, హిందూ మతంపై 140కు పైగా ఘటనలు జరిగాయనే విషయం డీజీపీగారికి తెలియదా? ఇన్ని జరుగుతుంటే ఒక్కరోజైనా డీజీపీగారు, ఘటనలకు కారకులైన వారిని అరెస్ట్ చేసి, మీడియా ముందుకొచ్చి మాట్లాడారా? అలా చేయలేక పోవడం ఆయన అసమర్థత కాదా?. ఒక మతంపై పనిగట్టుకొని దాడిచేస్తున్నారు.. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడండి అని చంద్రబాబు కోరితే, ఆయనపై మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటారా? మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా, విగ్రహధ్వంసాలను అవహేళన చేసేలా కొడాలి నానీ మాట్లాడినప్పుడు డీజీపీగారు ఏమయ్యారు? విగ్రహ ధ్వంసాలు జరిగినప్పుడు రాయేకదా ఏమైంది అన్నప్పుడు మంత్రిపై ఎందుకు కేసులు పెట్టలేదు?"
"దుర్గగుడిలో వెండిసింహాలు మాయమైతే పోలీసులు ఎవరిపై కేసులుపెట్టారు? రాములవారి శిరస్సు ఖండించడంతో ప్రజల్లో మొదలైన ఆందోళనలు గమనించి, ప్రతిపక్షనేతహోదాలో చంద్రబాబునాయుడు రామతీర్థం వెళితే ఆయనపై కేసులు పెడతామంటారా? నోటికొచ్చినట్లు మాట్లాడిన కొడాలినానీ మాత్రం దర్జాగా పేకాట ఆడిస్తూ చెరువు గట్లపై తిరుగుతున్నాడు. జగన్ సారథ్యంలోని ప్రభుత్వానికి చెందిన మంత్రి కదా? రాష్ట్రంలోవైసీపీ సెక్షన్లు నడుస్తున్నాయి కదా? నిజంగా డీజీపీగారికి రాష్ట్రంలో మతసామరస్యం నెలకొల్పాలన్న ఆలోచనే ఉంటే, ముందుచర్యలు తీసుకోవాల్సింది కొడాలినానీపైనే. డీజీపీగారి మాటలే చాలు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయి మాట్లాడుతున్నాడని. ముందు కొడాలినానీని అరెస్ట్ చేశాకే, డీజీపీగారు చంద్రబాబు గురించి, ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడాలి. అప్పటివరకు ఆయనకు మాట్లాడే హక్కనేది లేదు. ఆ హక్కుని ఆయన ఎప్పుడో కోల్పోయాడు. విజయవాడ బస్టాండ్ లో సీతమ్మ తల్లి విగ్రహాన్ని ఎలుకలుధ్వంసం చేశాయన్న పోలీసులపై డీజీపీగారు ఏంచర్యలు తీసుకున్నారు. విజయవాడ డీసీపీ విక్రాంత్ పాటిల్, అలా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకుంటానంటే , తాము ఆరోజున ఆందోళన విరమించాం. కానీ ఇంతవరకు ఎలుకలు విగ్రహాన్ని ధ్వంసం చేశాయన్నసీఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజీపీగారు అటువంటి చర్యలు తీసుకోనంతవరకు ఆయనకు మాట్లాడే అర్హత లేనేలేదు." అని పట్టాభి అన్నారు.