జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు, ప్రతి నెలకు ఒక రికార్డు కొడుతుంది. గతంలో చంద్రబాబు హయాంలో, 5 ఎల్లో లక్షా 25 వేల కోట్లు అప్పు చేస్తే, నానా గగ్గోలు పెట్టి, నానా హంగామా చేసి, చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు అంటూ, అప్పటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే అప్పట్లో చంద్రబాబు తెచ్చిన అప్పు, అభివృద్ధి రూపంలో కళ్ళకు కన్పించింది. అమరావతి, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, పంచాయతీల్లో రోడ్డులు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కనిపించాయి. అలాగే రుణమాఫీ, పసుపు కుంకుమ లాంటివి లేక్కేస్తేనే, సంక్షేమానికి ఈ రెండు పధకాల్లోనే 35 వేల కోట్ల రూపాయలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, గతంలో చంద్రబాబు పై చేసిన విమర్శలకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తుంది. గతంలో ఏది అయితే తప్పు అన్నారో, అంతకు పదింతలు తప్పు చేస్తున్నారు. గతంలో అభివృద్ధి కళ్ళకు కనిపించింది, నేడు కనీసం రోడ్డుకు పడిన గుంతలు కూడా పుడ్చేవారు లేరు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ లేదు, ఒక్క కొత్త రోడ్డు లేదు, ఏమి లేదు. అయితే సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. సంక్షేమం కావాల్సిందే, అయితే ఆదాయం పెంచే మార్గం చూడకుండా, అప్పులతో ఎంత వరకు సంక్షేమం చేయగలం ?
ఇక అసలు విషయానికి వస్తే, నవంబర్ నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల లెక్క బయటకు వచ్చింది. కాగ్ ప్రతి నెల విడుదల చేసే లెక్కలు, నవంబర్ వరకు వచ్చాయి. అయితే నవంబర్ నెలలో ప్రభుత్వం ఏకంగా 13 వేల కోట్లు అప్పు చేసింది. మరి నవంబర్ నెలలో అంత పెద్ద కార్యక్రమం ఏమి చేసారో ప్రభుత్వానికి తెలియాలి. ఈ ఆర్ధిక సంవత్సరం, నవంబర్ వరకు, ప్రభుత్వం చేసిన అప్పు దాదపుగా 74 వేల కోట్లు వరకు వెళ్ళింది. గత ఏడాది 45 వేల కోట్లకు పైగా అప్పు ఉంది. అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇప్పటి వరకు చేసిన అప్పు, లక్ష కోట్లు దాటిపోయింది. చంద్రబాబు 5 ఏళ్ళలో చేసింది, జగన్ ఏడాదిన్నరలోనే చేసారు. ఇక ఇప్పటి వరకు ఏపి అప్పు మొత్తం లెక్కిస్తే, ఏపిలో ఉన్న ప్రతి ఒక్కరి తల పై, రూ.70 వేలకు చేరింది. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన అప్పు, గత ప్రభుత్వం చేసిన అప్పు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పుతో ఇంత వరకు వచ్చింది. ఇక కేవలం ఈ ఆర్ధిక ఏడాది లెక్కలు లెక్కిస్తే, ఈ ఎనిమిది నెలల్లోనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన అప్పుతో, ఒక్కో తల పై రూ.13వేలకు పైగా భారం పడింది. ఇది మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.