రెండో దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న రచ్చ పై, చంద్రబాబు స్పందించారు. జరుగుతున్న పరిణామాల పై చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై కూడా ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లో "పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా సమాధానం చెప్పాలి. ఇదేనా శాంతియుత ఎన్నికల నిర్వహణ? బలవంతపు ఏకగ్రీవాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నా. 38 సంత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంది. వైకాపాకు తాత్కాలికంగా పైశాచిక ఆనందం ఉండొచ్చేమో గానీ భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నా. వైకాపా మాదిరి ప్రతిఒక్కరు విధ్వంసాలు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యం మనుగడ ఉండేదే కాదు. మీ పిరికితనంతో, మీ బరితెగింపుతో ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. తెలుగుదేశం మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. ఈ అక్రమాలకు పాల్పడిన ప్రతిఒక్కరిని కోర్టులకు లాగుతాం. దుర్మార్గులకు వంత పాడాలని చూస్తే మిమల్ని ఎలా కంట్రోల్ చేయాలో చేసే నైతిక శక్తి తెలుగుదేశం కు ఉందని గుర్తుపెట్టుకోండి. రాత్రి ఒంటిగంట వరకు వందల పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అధికారులు వాటన్నింటిని వైకాపాకు డిక్లేర్ చేశారు. ఇదేనా నిబద్ధతా? కొన్ని సందర్భాలలో మీడియాను పెట్టి ఓట్ల లెక్కింపు చేసిన సంధర్బాలు ఉన్నాయి. అదీ ట్రాన్స్ఫరెన్సీ అంటే. అది ప్రజాస్వామ్య గొప్పతనం. వైకాపా చేసేది పిరికితనం. కౌటింగ్ కేంద్రానికి వెళ్లి బ్యాలెట్ లను ఎత్తుకెళ్లే పరిస్థితికి సాక్షాత్తు ఒక ఆర్.డి.ఓ కూడా ధృవీకరించారు. దీనికి పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ కు కనపడటం లేదా? "
"అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. ఏ వ్యవస్థ అయినా రాజీపడొచ్చు కానీ.. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం కోసం రాజీపడదు. టీడీపీ తప్పుడు కార్యక్రమాలు చేయాలనుకుంటే.. మీరెవరూ అడ్రస్ కూడా ఉండరు. ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగే పరిస్థితి ఉండదు. ఈ రెండు సంఘటనలపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఎన్నికల కోసం వేసిన ఐజీని అడుగుతున్నా... దీనికి సమాధానం చెప్పాలి. ఏం చర్యలు తీసుకున్నారు? పుంగనూరులో పోలీసులు బరితెగించారు. మళ్లీ మీరు ఈ రాష్ట్రంలో పనిచేయరా? ఏమిటీ ఇవన్నీ. మాచర్లలో కూడా ఇంతే. సీఐ, ఎస్ఐ బరితెగించి మానవహక్కులను కాలరాశారు. బలవంతపు ఏకగ్రీవాలపై, తిరస్కరించిన నామినేషన్లపై కోర్టులో వేస్తాం. పుంగనూరుపై కోర్టుకు వెళ్తాం. అవసరమైతే సుప్రీంకు వెళ్తాం. దోషులను బోను ఎక్కిస్తాం. మంత్రికి సహకరించిన ప్రతిఒక్కరికి, చట్టవ్యతిరేకంగా చేసినవారికి శిక్షపడేవరకు వదిలిపెట్టం. మాచర్లపైనా కోర్టుకు వెళ్తాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మీరు.. ప్రజాస్వామ్య ద్రోహులు. నిన్న బ్రహ్మాండంగా పనిచేసిన కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు మీరు చూపిన పోరాటస్ఫూర్తి చరిత్రలో ఉంటుంది. ప్రజలు కూడా వీరోచితంగా పోరాడారు. వారిని కూడా అభినందిస్తున్నా. ప్రజలందరూ ఒకటైతే.. ఈసీ తన అధికారాలను ఉపయోగించుకోలేకపోయినా మనం ఉపయోగించుకుని ప్రభుత్వం, పోలసులపై ఒత్తిడి పెంచి న్యాయం కోసం, హక్కుల కోసం పోరాడదాం. నిన్న ఎన్నికల్లో చూపించిన చొరవకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. భవిష్యత్ లో కూడా అందరూ సమైక్యంగా పనిచేసి మీ గ్రామానికి సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం కోసం మీరందరూ పనిచేసుకోవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయాలి. మీరందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాకోవాలని కోరుకుంటూ.. చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నికల కమిషన్ కు కూడా బాధ్యత ఉంటుందని గుర్తించాలి. " అని చంద్రబాబు అన్నారు.