ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి తెలియని వారు ఉండరు. గత సార్వత్రిక ఎన్నికల్లో, ఆయన పై తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. ఎన్నికల సమయంలో, అప్పటి చీఫ్ సెక్రటరీ పునేటాను తొలగించి, ఎల్వీ సుబ్రహ్మణ్యంను పెట్టారు. ఆ సమయంలో ఆయన వైసీపీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పటి లాగా అప్పుడు,మేము పని చేయం, మా ఇష్టం అని చెప్పలేదు, అప్పటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు, నిరసన తెలిపారు కానీ, ఇప్పటి లాగా, సహాయ నిరాకరణ చేసి, ఎన్నికలు జరపం అంటూ తప్పుకోలేదు. ఇక తరువాత ఎల్వీ సుబ్రహ్మణ్యం, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సంతోషంగా ఉన్నటే కనిపించారు. జగన్ కూడా, సుబ్బన్నా సుబ్బన్నా అంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఉన్నట్టు ఉండి ఒక రోజు ఎల్వీ సుబ్రహ్మణ్యం, బాపట్ల ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఒక చీఫ్ సెక్రెటరిని బదిలీ చేయటం అనేది చాలా అరుదు. జగన్ కు, ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఏమి తేడాలు వచ్చాయో కానీ, బదిలీ అయిపోయారు. అయితే ఇన్నాళ్ళకు ఎల్వీ సుబ్రహ్మణ్యం మళ్ళీ మీడియా ముందు కనిపించారు. అది కూడా, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కమిషన్, ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య గొడవకు సంబంధించి, మాట్లాడారు.
నిన్న తెనాలిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం పర్యటించారు. అయోధ్యలో రామజన్మభూమిలో, నిర్మిస్తున్న దేవాలయం నిర్మాణానికి సంబంధించి విరాళాలు సమీకరించటంలో భాగంగా, ఆయన నిన్న తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న వివాదం పై స్పందించారు. ఎంతటి ఉద్యోగి అయినా సరే, రాజ్యాంగానికి లోబడి పని చేయాలని, ఎన్నికల సంఘానికి సహకరించాలని అన్నారు. సామాన్యులతో పోలీస్తే, ఉద్యోగులు రాజ్యాంగాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ గౌరవించాలని అన్నారు. ఉద్యోగులు రాజ్యాంగ స్పూర్తితో పని చేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని మనం రక్షిస్తేనే, రాజ్యాంగం మనల్ని రక్షిస్తుందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో, క-రో-నా భయం అని ఉద్యోగులు అంటున్నారని, అలాంటి సమయంలో ఎన్నికల కమిషన్ ని, ప్రభుత్వాన్ని అడిగి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. గతంలో రాజ్యాంగం కోసం, ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారని, ఇప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని, గౌరవిస్తే చాలని అన్నారు. కోర్టులు ఇస్తున్న తీర్పులు కూడా అదే చెప్తున్నాయని అన్నారు.