జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో, సొంత రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా తల పట్టుకుంటున్నాయి. సహజంగా ప్రభుత్వాలు ఏ పని చేసినా, ప్రజలకు ఉపయోగపడేలా,అందరికీ సౌకర్యంగా ఉండేలా, నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం, ఒక ప్రాంతం మీద కక్షతోనో, ఒక కులం మీదో, ఒక వ్యక్తి మీద కక్షతోనే నిర్ణయాలు ఉంటాయని, అమరావతి రాజధాని విషయంలో తేలిపోయింది. రాష్ట్రానికి మధ్యలో, అందరికీ అందుబాటులో కాకుండా, ప్రభుత్వం వైజాగ్ లో పెట్టాలని నిర్ణయం తీసుకోవటం, అన్ని కార్యాలయాలు అక్కడికే తరలించాలనే పట్టుదలతో, సంబంధం లేని శాఖలు కూడా వైజాగ్ తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పటంతో, ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా అవాక్కవుతున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. అయితే విభజన చట్టం ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, ఇరు ప్రభుత్వాల సమ్మతితో, విజయవాడలో పెట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది పరివాహాక ప్రాంతంలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం తారుమారు అయ్యింది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుని విజయవాడలో కాకుండా, దాన్ని తీసుకుని వెళ్లి విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని పై సొంత రాష్ట్రంలో విమర్శలు వచ్చాయి. కృష్ణా నది ఉన్న చోట, కాకుండా ఎక్కడో వైజాగ్ లో ఏంటి, మీకు విజయవాడ ఇష్టం లేకపోతే, కనీసం రాయలసీమలో, కర్నూల్ లో అయిన పెట్టండి అంటూ, డిమాండ్ లు సొంత రాష్ట్రం నుంచి వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం పై కేసీఆర్ సర్కార్ కూడా ఆగ్రహం వ్యాక్తం చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే ఒప్పుకున్నాం అని, అసలు సంబంధం లేని వైజాగ్ లో, కృష్ణా నదికి 300 కిమీ అవతల ఎలా పెడతారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఘాటుగా లేఖ రాసారు. అయితే విజయవాడ అయితే ఒప్పుకుంటాం అని, లేకపోతే హైదరాబాద్ లోనే ఉంచేయండి అంటూ లేఖలో తెలిపారు. దీంతో ఇప్పుడు వైజాగ్ కాదు, విజయవాడ కాదు, అసలు రాష్ట్రానికి రాకుండా, బోర్డు కార్యాలయం హైదరాబాద్ లోనే ఉండి పోయే అవకాసం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వీడి, విజయవాడలో కానీ, కర్నూల్ లో కానీ పెట్టటానికి ఒప్పుకుంటే, సమస్య పరిష్కారం అయ్యే అవకాసం ఉంది.