జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోయాయి. ఇసుక లేక ఆగిపోయిన నిర్మాణలతో మొదలైన ఆదాయం తరుగుదల, కరోనాతో తారా స్థాయికి చేరుకుంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారు లేక, ఆదాయం లేకుండా పోయింది. ఇలా అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం పెంచుకునే మార్గాలు కాకుండా, డబ్బులు పంచి పెట్టే సంక్షేమ పధకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో ఆదాయ మార్గాలు లేకుండా పోయాయి. ఇక మరో పక్క కేంద్రం కూడా జీఎస్టీ పరిహారం ఇవ్వం అంటూ చేతులు ఎత్తేసింది. ప్రతి నెల మొదటి వారంలో, జీతాలు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోయిన నెలలో జీతాలు లేట్ అయ్యాయి. అప్పు పుట్టిన తరువాత జీతం ఇచ్చారని, కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నెల కూడా ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో నెట్టుకుని వస్తుంది. ఇప్పటికే ఈ 15 నెలల్లో లక్ష కోట్లు అప్పు చేసారని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మూడు నెలలు కాలానికే 30 వేల కోట్లు పైగా అప్పు చేసారని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ప్రతి ఒక్కరి తల పై ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఏడాదికి 20 వేల రూపాయల అదనపు భారం పడిందని తెలుగుదేశం లెక్కలతో ఆరోపిస్తుంది.
ఈ నేపధ్యంలో, జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుకునే అవకాసం ఇవ్వటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఖుషీగా ఉంది. అయితే వీటి కోసం కేంద్రం కొన్ని షరతులు విధించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఎన్ని షరతులకైనా ఒప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర జీఎస్డీపీలో 3.5 శాతం మాత్రమే అప్పు తీసుకునే వీలు ఉంది. అయితే కేంద్రం పెట్టిన కొత్త పరిమితి ప్రకారం, ఇప్పుడు ఇది 5 శాతానికి పెరగనుంది. అంటే దాదపుగా 20 వేల కోట్లు అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వీలు ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే దీనికి సంబందించిన ఆర్డినెన్స్ ను తయారు చేసి, గవర్నర్ వద్దకు పంపినట్టు, అలాగే గవర్నర్ కూడా దీన్ని ఆమోదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆర్దినెన్స్ ను కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీగా ఊరటను ఇచ్చే అంశం అయినా, రాష్ట్రానికి , రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇది అదనపు భారమే. ఎందుకంటే ఈ తీసుకునే అప్పుతో ఆదాయం పెంచే మార్గాలు, ప్రభుత్వాలు చేస్తాయా అంటే, సందేహమే.