'ఒక జడ్జినే ఇంట్లో నుంచి బయటకు రావద్దంటారా.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. అంతేగాకుండా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకున్నట్టే' అని ఏపీ హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సస్పెన్షన్లో ఉన్న చిత్తూరు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రామకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ కొత్తకోట తహశీల్దార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పది రోజులపాటు సస్పెండ్ చేసింది. జడ్జి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తకోట తహశీల్దార్ జారీ చేసిన ఆదేశాలపై జడ్జి రామకృష్ణ, ఆయన కుమారుడు ఎస్.వంశీకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరపున సీనియర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం విచారణ చేపట్టారు. తహశీల్దార్ ఆదేశాల వల్ల జడ్జి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. తహశీల్దార్ ఇచ్చిన ఆదేశాలు చట్ట, న్యాయ విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఒక జడ్జినే బయటకు రావద్దంటూ ఆదేశాలు ఇవ్వడమంటే వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆదేశాలపై ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తహశీల్దార్ ఆదేశాలను పది రోజులపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. పది రోజుల తర్వాత ఈ కేసులో మరోసారి వాదనలు విని, తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. గత రెండు మూడు నెలలుగా జడ్జి రామకృష్ణ వ్యవహారం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఆయనను అధికార పార్టీకి చెందిన నేతలు టార్గెట్ చేసారని, వేదిస్తున్నారని, కేసులు పెట్టటం, మీడియా ముందుకు రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక మరో పక్క జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంలో, కోర్టులని ఈశ్వరయ్య టార్గెట్ చేసారు అంటూ, ఆయన ఆడియో టేప్ బయట పెట్టి, అది కూడా హైకోర్టు ముందుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.