టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై నిశితంగా చర్చించారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎంపీలకు.. సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. పార్లమెంట్లో గతం కంటే ఉధృతంగా పోరాటం చేయాలని ఎంపీలకు సీఎం సూచించారు. కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాల నేతలను కలిసి ఏపీకి జరిగిన అన్యాయంపై మద్దతు కోరాలని ఎంపీలకు సీఎం సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతు కోరి.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాటం చేయాలన్నారు. అవిశ్వాస తీర్మానం మళ్లీ పెట్టి.. తీర్మానానికి మిగిలిన ప్రతిపక్షాల మద్దతు కోరాలని ఎంపీలకు చంద్రబాబు సూచించడం జరిగింది. ఏపీకి బీజేపీ చేసిన నమ్మకద్రోహంపై పార్లమెంట్ సాక్షిగా నిలదీయాలన్నారు.
చంద్రబాబు సూచనల మేరకు, ఎంపీలు రెడీ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నేతలను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలవనున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. ఆదివారం సాయంత్రం ముంబైలో శరద్‌పవార్, ఉద్ధవ్థాకరేలను ఎంపీలు తోట నరసింహం, రవీంద్ర బాబు కలవనున్నారు. అలాగే డీఎంకే, అన్నాడీఎంకే నేతలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలవనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అశోక్‌గజపతి రాజు, కొనకళ్ళ నారాయణ, శివప్రసాద్ కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రం పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం గురించి వివరించనున్నారు. తమ పోరాటానికి, పార్లమెంట్ లో సహకారం అందించాలని కోరనున్నారు.
మరో పక్క, ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిస్వాస తీర్మానం పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశనం చేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాసం పెట్టాలని, అలాగే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. లోకసభలో ప్రస్తుతం బీజేపీ బలం తగ్గిపోయిందని, మిత్రపక్షాల కారణంగా బీజేపీకి ఆధిక్యత ఉందని, కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి, కేంద్రం పై పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.