అమరావతి ఉద్యమం గత 300 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇంకా అవే అవహేళనలు చేస్తూనే ఉన్నారు. అయితే మరో పక్క, రైతులు, జేఏసి నేతలు, న్యాయ పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు. పలు కేసులు ఇప్పటికే హైకోర్టు ముందు ఉన్నాయి. ఒక పక్క ధర్మ పోరాటం, మరో పక్క న్యాయ పోరాటం చేస్తూ, అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, అమరావతి ఉద్యమం, ఢిల్లీ పెద్దలకు వివరించి వారి మద్దతు కూడా తెచ్చే ప్రయత్నంలో భాగంగా, గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నారు. అమరావతి జేఏసి నేతలు, రైతులు, నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో, ఒక అనూహ్య వ్యక్తి వచ్చి మద్దతు పలికారు. ఆయినే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే అమరావతి పోరాటానికి అవసరం వచ్చిన ప్రతి సారి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన బృందంలో ఉన్నారు.
నిన్న ఢిల్లీ వెళ్ళిన ఈ బృందం, ఈ రోజు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద, బాపూజీకి నివాళులు అర్పించి, మౌన ప్రదర్శన చేసారు. మౌన ప్రదర్శనలో అమరావతి జేఏసి నేతలు, రైతులు, వంగవీటి రాధా, అలాగే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి కూడా పాల్గున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. అయితే మీడియాతో మాట్లాడిన నేతలు, ఈ రోజు మౌన ప్రదర్శన చేసామని, రేపటి నుంచి, కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారిని, వివిధ పార్టీల ప్రతినిధులను, ఇతర ముఖ్య నేతలను కలుస్తామని అన్నారు. అమరావతి కోసం రైతుల చేసిన త్యాగం, ఇప్పటి వరకు అక్కడ జరిగిన నిర్మాణాలు, అలాగే పెట్టిన ఖర్చు, మూడు ముక్కల రాజధాని వల్ల కలిగే ఇబ్బందులు, ఇవన్నీ వారికి వివరిస్తామని, అమరావతి కోసం మద్దతు కూడగడతామని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు. అమరావతి నేతల, ఢిల్లీ పర్యటన ఈ వీడియోలో చూడవచ్చు https://youtu.be/-sDG0bLnCDY