కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖ చూసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ తమకు అప్ప చెప్పేయాలని ఆయన కేంద్రానికి లేఖ రాసారు. రాయలసీమ ప్రజలకు, ఇటు డెల్టా ప్రజలకు శ్రీశైలం నుంచి వదిలే నీరే ఆధారం. డెల్టా ప్రాంతానికి పట్టిసీమతో ఊరట ఉన్న సీమకు మాత్రం శ్రీశైలం నుంచి వదిలే నీరే ముఖ్యం. అయితే దీని నిర్వహణ తమకు అప్ప చెప్పాలి అంటూ, కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయటంతో, ఏపి ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ పోయిందనే బాధ మరువక ముందే, ఏకంగా శ్రీశైలం ప్రాజెక్ట్ కే ఎసరు పెట్టారు. అయితే దీనికి కారణాలు చెప్తూ, పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ నీరు వాడుకుంటుందని, తమ వాటా నీటిని కోల్పోతున్నామని, అందుకే శ్రీశైలం నిర్వహణ తమకు ఇవ్వాలని కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. అయితే దీని వెనుక కేసీఆర్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉందని, ఏపి ఈ వాదనను బలంగా తిప్పి కొట్టాలని ఏపి రైతులు కోరుతున్నారు. ఇక కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో మరో కీలక అంశం కూడా ఉంది. రాయలసీమను ఎడారి చేసే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ మోహన్ రెడ్డి వెళ్ళటం పై, అప్పట్లో ఏపిలో అనేక విమర్శలు వచ్చాయి.
ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం వల్ల సీమ రైతులకు నష్టం అని ధర్నాలు చేసి, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళటం పై, అప్పట్లో చంద్రబాబు కూడా హెచ్చరించారు. ఇది మీ ఇద్దరి వ్యవహారం కాదు, భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతాం అని హెచ్చరించారు. అయితే చంద్రబాబు మాటలు నిజం కావటానికి ఏడాది కూడా పట్టలేదు. కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో, తాము ఎక్కడ ఎలాంటి ఉల్లంఘనలు చెయ్యలేదు అని, అన్నీ పాత ప్రాజెక్ట్ లు మాత్రమే అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏపి అభ్యంతరాలు అర్ధరహితం అని, ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి, జగన్ మోహన్ రెడ్డి వచ్చి, ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని ఎద్దేవా చేసారు. అయితే ఇవన్నీ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావిస్తారు. నాడు చేసింది తప్పు అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేము వ్యతిరేకం అని, ఏపి వాదనలు గట్టిగా వినిపించాలి. అదే విధంగా, శ్రీశైలం తమకు ఇవ్వాలని తెలంగాణా చేసిన ప్రతిపాదనను, మొగ్గలోనే తుంచేయాలి. వ్యక్తిగత స్నేహాలు పక్కన పెట్టి, రాష్ట్రం కోసం బలంగా వాదనలు వినిపించాలి.