ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధానిలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుల ఆకర్షణకు అనుసరిస్తున్న వినూత్న పథకాలలో భాగంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ (హెచ్‌సీఎల్) టెక్నాలజీస్ లిమిటెడ్‌కు చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన అత్యున్నత బృందం బుధవారం విజయవాడ మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలను సందర్శించింది. ఈ సందర్భంగా సంబంధిత సంస్థ తమ శాఖను త్వరలో విజయవాడలో స్థాపించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు వ్యవహారాలు, పెట్టుబడులు సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ వేమూరి రవికిరణ్ ఆధ్వర్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉపాద్యక్షుడు గణేష్‌కుమార్, జనరల్ మేనేజర్ రామచంద్రన్, అసోసియేట్ జనరల్ మేనేజర్ నిహాల్ అహ్మద్, సీనియర్ మేనేజర్లు శ్రీవేంకటేష్, రామకృష్ణన్ రాజగోపాలన్, రాజమురుగన్ కళాశాలను సందర్శించి వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పట్టభద్రులైన విద్యార్థులకు త్వరలో బ్యాంకింగ్ రంగంలో బి.పి.ఓ. సేవలు అందించేందుకు 1000 మంది ఉద్యోగులకు సరిపడా కార్యాలయం లభ్యత గురించి పరిశీలించారు.
ఈ సందర్శనలో భాగంగా కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ డాక్టర్ రాజేష్ సి. జంపాల పాల్గొని కళాశాల ప్రత్యేకతలను, విద్యార్థుల ప్రతిభా, నైపుణ్యాలను బృంద సభ్యులకు వివరించారు. అనంతరం బృంద సభ్యులు విద్యార్థులతో స్వయంగా సంభాషించి వారి భావప్రకటన నైపుణ్యాన్ని, విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని అభినందించారు. బి.బి.ఎ. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల బృందం ఉదిత్, ప్రణయ్ పట్వారీ, ప్రేక్షగొలేచా స్థాపించిన అంకుర సంస్థ ద్వారా త్వరలో నిర్వహిస్తున్న అమరావతి మోడల్ యునైటెడ్ నేషన్స్ ప్రాజెక్టును బృందంసభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
బృందసభ్యుల వెంట కామర్స్ విభాగాధిపతి నారాయణరావు, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి రమేష్‌చంద్ర, కళాశాల ఉపాధి అధికారి కావూరి శ్రీధర్ తదితరులు పాల్గొని కళాశాల విశిష్టతను వివరించారు.