గతంలో పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనకు సంబంధించి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దాడిలో పాల్గున్న వారి అందరి పై గతంలో, అప్పటి ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అయితే ఈ కేసు పై, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్, కేసుల ప్రాసిక్యూషన్ ని ఉపసంహరించుకుంటున్నట్టు , రాష్ట్ర ప్రభుత్వానికి ఓక లేఖ రాసారు. డీజీపీ లేఖను ఆమోదించిన ప్రభుత్వం, ఒక జీవోని విడుదల చేసింది. అయితే ఈ జీవో విడుదలే చట్ట విరుద్ధం అని చెప్పి హైకోర్టు వ్యాఖానించింది. ముఖ్యంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అంశం మొత్తం పై పసుపులేటి రమేష్ అనే వ్యక్తి, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ఈ రోజు హైకోర్టులో ఈ కేసు విచారణకు రావటంతో, పిటీషనర్ తరుపు న్యాయవాదులు, గట్టిగా వాదనలు వినిపించారు. స్టేషన్ పై దాడిలో, పోలీసులే ప్రాసిక్యూషన్ ని ఉపసంహరించు కోవటం అనే అంశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అని వారు గట్టిగా వాదించారు.
ఇటువంటి నేరాలు మళ్ళీ జరక్కుండా ఉండాలి అంటే, ఇలాంటి జీవోలు ఇవ్వకూడదని వారు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు, పోలీసుల పైన, ఈ ఉత్తర్వులు ఇచ్చిన అధికారుల పైనా ఆగ్రహం వ్యక్తం చేసారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో, ముస్లిం యువత అంటూ ప్రస్తావించి, ఇలాంటి జీవోలు ఇస్తే కనుక, భ్యవిష్యత్తులో కేసులు పెట్టటానికి కూడా పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటీషన్ లో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఒక పార్టీగా చెయ్యాలని, పిటీషనర్ కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా పడింది. పోలీసుల పైనే నేరుగా దాడి జరిగితే, కేసుని ఉపసంహరించుకుంటూ ఎలా ఆదేశాలు ఇస్తారు, దాన్ని ప్రభుత్వం ఎలా ఆమోదించింది అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. దీని పై మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇస్తే, ఈ కేసుని రద్దు చెయ్యటం కుదరదు, కొనసాగించాలని ఆదేశించింది.