ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలే కాదు, ఈ ప్రభుత్వంలో పని చేస్తున్న ఆఫీసర్లు కూడా విమర్శ తట్టుకోలేక పోతున్నారని, తెలుగుదేశం పార్టీ ప్రాధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. గతంలో మాస్కు అడిగిన దళిత మేధావి, డాక్టర్ సుధాకర్ ని, వేధింపులకు గురి చేసి, చివరకు పిచ్చోడిని చేసారని, ఆయన విధుల్లో పాల్గునటానికి మాస్కు అడగటమే పాపమా ? అని ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా అకారణంగా తమ పై నిందలు వేస్తున్నారని, తాము ఎంతో కష్టపడుతున్నా తమ పై నిందలు ఎందుకు వేస్తున్నారు అని, ఒక గిరిజన వైద్యాధికారి సోమ్లా నాయక్ ప్రశ్నించినందుకు, ఆయన్ను అరెస్ట్ చెయ్యమని కలెక్టర్ ఆదేశించటం దారుణం అని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోజరుగుతున్న సమీక్షలో, అందరి ముందు సోమ్లా నాయక్ ను కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా, ఆయన్ను అరెస్ట్ చేయ్యండి అంటూ, పోలీసులని ఆదేశించటం పై, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రశ్నిస్తే తట్టుకోలేరా ? ఏమిటి ఈ దౌర్జన్యం అని నిలదీశారు. ఒక పక్క వైసీపీ నాయకులు వైరస్ వ్యాప్తి చేస్తుంటే, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.
ఈ రోజు నరసరావుపేటలో కలెక్టర్ సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా, వైద్య సబ్బంది తీరు పై, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పై అభ్యంతరం చెప్తూ, నాదెండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ తన నిరసన తెలియచేసారు. తాము ప్రాణాలకు తెగించి, కష్ట కాలంలో పని చేస్తుంటే, మమల్ని కించ పరుస్తారా అని ప్రశ్నించారు. దీంతో గుంటూరు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హౌ డేర్ యు కాల్ మీ, హూ ఆర్ యు, అతన్ని అరెస్ట్ చెయ్యండి అంటూ, అక్కడ ఉన్న డీఎస్పీకి ఆదేశించారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం స్పందించింది. కలెక్టర్ తీరుని ఖండించింది. ఏదైనా తప్పు ఉంటే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోండి కనీ, ఈ విధంగా అరెస్ట్ చెయ్యండి అంటూ బహిరంగంగా చెప్పటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అరెస్ట్ ఆదేశాలు అమలు చేస్తే మాత్రం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతామని, ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే, మాకు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.