ఏపి రాజకీయాల్లో, ప్రతి రోజు వార్తల్లో ఉండే నరసాపురం ఎంపీ రఘురామరాజు, ఈ రోజు ఏపిలో హిందూ మతం పై వరుస దాడులు జరుగుతున్నాయని, నిరసన దీక్ష చేసారు. అయితే దీక్షలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కూర్చున్నారు. మరో పక్క అమరావతి పోరాటం చేస్తున్న జీవీఆర్ శాస్త్రి కూడా ఈ దీక్షలో కూర్చున్నారు. అలాగే మరికొందరు కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీ ఈ దీక్షలో పాల్గునటంతో, వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక రఘురామరాజు మీడియాతో మాట్లాడుతూ, ధార్మికతకు, మత సామరస్యతకు పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని అనంరు. ముఖ్యంగా ఈ దాడుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, పిచ్చివాళ్ల పని అంటూ కొట్టిపారవేయడం, బాధితులపై ఎటువంటి చర్య తీసుకొనే ప్రయత్నం చేయక పోతూ ఉండడంతో హిందువుల మనోభావాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు,
దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులతో కలత చెందిన నేను గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు ఈ దీక్ష చేయతలపెట్టానని, దేవాలయాలపై దాడులు జరగకుండా వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనల పై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వంను కోరడం కోసమే ఈ దీక్షను నిర్వహిస్తున్నానని అన్నారు. దేవాలయాలు పరిరక్షణకు చేపడుతున్న ఈ పవిత్ర దీక్షా కార్యక్రమంకు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు నైతిక మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇటువంటి దాడులను అడ్డుకోని పక్షంలో రాష్ట్రంలో ప్రజల మధ్య మతసామరస్యం దెబ్బతిని, అశాంతి రాజుకొనే అవకాశం ఉంటుందనే ఆందోళనయే నన్ను ఈ దీక్ష జరపడానికి ప్రేరేపిస్తుందని, ఆ విధంగా జరిగితే రాష్ట్రాభివృద్ధి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలని అన్నారు.