ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది కూడా మళ్ళీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కావటం విశేషం. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం పై హైకోర్టులో, సుప్రీం కోర్టులో పోరాడి, నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వం పై గెలిచి మళ్ళీ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన విధుల్లో చేరిన తరువాత, ఆయన పని ఆయన చేసుకుంటూ, ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ, ఈ వివాదానికి ఫూల్ స్టాప్ పెట్టారు. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో, మళ్ళీ నిమ్మగడ్డ తాజాగా హైకోర్టులో మరో పిటీషన్ వెయ్యటంతో, మరోసారి ఆసక్తిగా ఏమి జరుగుతుందా అని చూసే పరిస్థితి. తన ఆఫీస్ లో పని చేస్తున్న వారికి ఆటంకం కలిగిస్తూ, తమ విధుల్లో జోక్యం చేసుకుంటూ, తమను ఇబ్బంది పెడుతున్నారని, తమ పై సిఐడి కేసు వేసారని, ఆ కేసు కొట్టేయాలి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు, ఎలక్షన్ కమిషన్ లో పని చేసే మరో ఉద్యోగి హైకోర్టులో విడివిడిగా పిటీషన్ వేసారు. ఈ అంశం పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. సాంబమూర్తి వేసిన పిటీషన్ తో పాటు, ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టులో పిటీషన్ వేసారు.
ఒక ప్రభుత్వంలో ఉంటూ, ఒక డిపార్టుమెంటు ఏకంగా ప్రభుత్వం చేస్తున్న విచారణ పైనే , కోర్టుకు వెళ్ళటం చాలా అరుదు. అలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అయితే దీని పై విచారణ జరిపిన హైకోర్టు, సిఐడి విచారణ పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే విధిస్తూ, కౌంటర్ దాఖలు చెయ్యాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే కేసుని వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసారు. తరువాత వైసిపీ నుంచి ఎదురుదాడి జరగటంతో, ఆయన కేంద్రానికి ఘాటు లేఖ రాస్తూ, తనకు కేంద్ర బలగాల రక్షణ కావలని కోరారు. అయితే ఈ లేఖ పై విజయసాయి రెడ్డి అభ్యంతరం చెప్తూ, ఇది తెలుగుదేశం ఆఫీస్ లో తయారు అయిన లేఖ అని, దీని పై విచారణ చెయ్యాలని డీజీపీని కోరటం, దీని పై సిఐడి విచారణ చకచకా జరిగిపోయాయి. అయితే, తానే లేఖ రాసాను అని నిమ్మగడ్డ చెప్పినా, కేంద్రం కూడా ఒప్పుకుని, బద్రత ఇచ్చిన, సిఐడి విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఈసి ఆఫీస్ నుంచి కంప్యూటర్ కూడా తీసుకు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారం పై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లారు. దీని పై ఈ రోజు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.