ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఏమి పాపం చేసారో కానీ, విభజన నాటి నుంచి, కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇందులో ప్రజలకు చైతన్యం లేకపోవటం కూడా ఒక కారణంగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. ముందుగా ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు తమ హక్కును వదులుకున్నారు. దీని పై ఉద్యమమే లేదు. మరి దీని విలువ తెలియక, సైలెంట్ గా ఉన్నారా, లేకపోతే పోరాడే పటిమ లేదో కానీ, ఇక ప్రత్యెక హోదా అనేది అందని విషయం అనే చెప్పాలి. అప్పటి ప్రభుత్వానికి చేతకలేదు, మెడలు వంచి తెస్తాం అని చెప్పిన అధికార పక్షం మాట్లాడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, ఏపికి రెండు కళ్ళుగా చెప్పుకుంది, ఒకటి పోలవరం, రెండు అమరావతి. ఎందుకంటే రెండిటి వళ్ళా, 13 జిల్లాలకు ఉపయోగం ఉంది. రాష్ట్ర రాజదాని అమరావతి, ఆర్ధిక కేంద్రంగా, ఉపాధి కేంద్రంగా మారుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ వల్ల, ప్రతి జిల్లాకు ఉపయోగం ఉంది. అందుకే ఇది జీవనాడి అయ్యింది. అయితే గత నవంబర్ నెలలో ఒక కన్ను అయిన అమరావతి ప్రాజెక్ట్ పై కుల ముద్ర వేసి, దాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేస్తుంటే కూడా ప్రజల్లో పెద్దగా పోరాడాలి అనే భావన రాలేదు. అది ఎదో ఆ 29 గ్రామాల సంగతి అని వదిలేస్తున్నారు. నిజానికి అది ప్రతి జిల్లా సమస్య. దీని కోసం అమరావతి ప్రాంత రైతులు, మహిళలు 300 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఇక మరో కన్ను, పోలవరం ప్రాజెక్ట్. ముందుగా అధికారం మారిన తరువాత, రివర్స్ టెండరింగ్ పేరుతొ దాదాపుగా ఏడు, ఎనిమిది నెలలు పనులు ఆపేశారు. తరువాత కోర్టుకు వెళ్ళటం, కరోనా రావటం, వీటి అన్నిటి నేపధ్యంలో, ఏదో పేరుకు సాగుతున్నాయి అంటే సాగుతుంది కానీ, చెప్పుకోతగ్గ పని అయితే అక్కడ ఏమి జరగటం లేదు.

మరో పక్క, కేంద్రం నుంచి, గత రాష్ట్ర ప్రభుత్వ హయంలో, పెట్టిన ఖర్చు కూడా, ఇప్పటి ప్రభుత్వం తెచ్చుకోలేక పోయింది. వీటి అన్నిటి నేపధ్యంలో, అసలు పోలవరం పరిస్థితి ఏమిటో అర్ధం కాని పరిస్థితిలో, గత మూడు రోజుల నుంచి కేంద్ర ఆర్ధిక శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు, 25 వేల కోట్లకు తగ్గించిందనే, వార్తలు వస్తున్నాయి. గత చంద్రబాబు హయంలో కేంద్ర జల శక్తి టెక్నికల్ కమిటీ కానీ, సిడబ్ల్యుసీ కానీ, 55 వేల కోట్లకు అంచనాలు, అప్రూవ్ చేసాయి. అయితే ఇప్పుడు మొత్తం తారు మారు అయ్యింది. ఈ నేపధ్యంలోనే, మంత్రి బుగ్గన, ఈ రోజు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసారు. అయితే ఆయనకు అక్కడ ఏమి భరోసా దొరకనట్టు ఉంది. ఎందుకంటే, ఆయన బయటకు వచ్చి మీడియా ముందు, ఇదంతా చంద్రబాబు చేసిన పాపం అని, అందుకే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు తగ్గిపోయాయి అంటు , చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే, కేంద్రం నుంచి ఎలాంటి భరోసా లేదు. 25 వేల కోట్లు అని కేంద్రం అంటుంది అంటే, ఇప్పటికే 14 వేల కోట్లు దాకా ఇచ్చింది కాబట్టి, మిగత రెండు మూడువేల కోట్లు పెండింగ్ తీసేస్తే, మరో 7 వేల కోట్లు ఇస్తే, కేంద్రం పని అయిపోతుంది. మరి 7 వేల కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుందా ? కేంద్రం, ఇలా చేస్తుంటే, రాష్ట్రం ఏమి చేస్తుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్, కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి పై, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో పోరాడి సాధిస్తుందా ? లేక ప్రత్యెక హోదా లాగా, మనం ఏమి చేయలేం, టైం కోసం ఎదురు చూడాలి అని చెప్తుందా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read