కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా తెదేపా ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన దీక్షను విరమించారు. ఆరోగ్యం బాగా దెబ్బతిందని, ఏ క్షణాన ఏమైనా జరగవచ్చి అని డాక్టర్లు చెప్పటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షలను విరమింప జేశారు. అంతకుముందు వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20న సీఎం రమేష్ దీక్షకు దిగారు. 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్ వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. ఆరోగ్యం బాగాలేకున్నా బీటెక్ రవి ఏడురోజులు దీక్ష చేశారని, సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించిందన్నారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు సీఎం రమేష్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీక్షలపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని సీఎం అన్నారు. విశాఖ ఉక్కు కోసం ఆనాడు ఆంధ్రులు పోరాడి విజయం సాధించామని, విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 19వేల ఎకరాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
సాధ్యాసాధ్యాలు పరిశీలించి కడపలో ప్లాంట్ పెట్టాలని చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం కాలయాపన చేసిందని విమర్శించారు. ఆరునెలల్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరతామని స్పష్టం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కేసుల కోసం లాలూచీపడి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెడుతున్నారని సీఎం ఆరోపించారు. కడప స్టీల్‌ఫ్యాక్టరీకి అన్ని వసతులు కల్పిస్తామని కేంద్రానికి చెప్పామన్నారు. గండికోటకు నీరు తీసుకొచ్చామని ఇప్పుడు నీటి కొరత కూడా లేదని తెలిపారు. 15కి.మీ. దూరంలో హైవే, రైల్వేలైన్ ఉందన్నారు. అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.