ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కు ఎదురైంది. అమరావతి ప్రాంతంలో ఉన్న తుళ్ళూరు మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబు గతంలో, ఏపి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన తరువాత, అక్కడున్న కొన్ని అసైన్డ్ భూములను, బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి అక్రమంగా కట్టబెట్టారని, ఈ మొత్తం కుట్రలో తుళ్ళూరు మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబు కు భాగస్వామి అంటూ, ఏపి ప్రభుత్వం, ఆయన పైన కేసు నమోదు చేసింది. సిబిసిఐడి కేసు నమోదు చేసింది. అయితే సిఐడి నమోదు చేసిన కేసు పై హైకోర్టుకు వెళ్ళగా, ఈ కేసులో తదుపరి విచారణ వరకు, ఎటువంటి ఆక్షన్ తీసుకోవద్దు అంటూ, హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పై, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ రోజు దీని పై సుప్రీం కోర్టు న్యాయస్థానం ముందు, పిటీషన్ విచారణకు వచ్చింది.
అయితే దీని పై వాదనలు వినిపించిన మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబు తరుపు న్యాయవాది, ఈ విషయం పై హైకోర్టు కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి, ఈ పిటీషన్ సుప్రీం కోర్టు ముందు విచారణ చెయ్యాల్సిన అవసరం లేదని, వాదించారు. న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు, స్టే ఎత్తివేయటానికి నిరాకరించింది. అయితే దీని పై హైకోర్టుకు మాత్రం కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయం పై ఒక వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని, హైకోర్టుని సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు తరువాత, ఆ విషయం పై అబ్యంతరాలు ఉంటే తమ వద్దు వస్తే, అప్పుడు ఈ సమస్య పై తగు ఆదేశాలు ఇస్తామని, అప్పటి వరకు స్టే ఎత్తివేయటం కుదరదని, ప్రభుత్వం వేసిన పిటీషన్ ను సుప్రీం తోసి పుచ్చింది. ఒక వేళ హైకోర్టు వారం రోజుల్లో ఏ నిర్ణయం తీసుకోకపోతే, ఈ కేసు మేము పరిష్కరిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.