చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు, రామచంద్ర పై, కొంత మంది దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే గత చరిత్ర, అక్కడ మంత్రి పెద్ద రెడ్డితో, జడ్జి రామకృష్ణకు ఉన్న వైరం నేపధ్యంలో, ఈ దాడి పెద్దిరెడ్డి మనుషులు చేసారు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇదే విషయం పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాసారు. ఒక రోజు ముందే విజయవాడలో దళితులు అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారని, ఆ సమావేశంలో ప్రభుత్వం చేస్తున్న దురాగతాల పై జడ్జి రామకృష్ణ విమర్శలు చేసారని, ఆ తరువాతే కొంత మంది వ్యక్తులు రామకృష్ణ సోదరుడు రామచంద్ర పై దాడి చేసారని, ఈ దాడి వెనుక మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందని వార్తలు వస్తున్నాయని, గత చరిత్ర, నేపధ్యం అన్నీ చూసి, తగు చర్యలు తీసుకోవాలని, డీజీపీకి లేఖ రాసారు చంద్రబాబు. అయితే ఈ రోజు చంద్రబాబు లేఖకు డీజీపీ సమాధానం ఇస్తూ, మీరు చెప్పింది తప్పు, రామచంద్రను కొట్టింది తెలుగుదేశం నాయకుడే, మీరు ఆధారాలు లేకుండా ఇలాంటి ఉత్తారాలు రాయకండి అంటూ చంద్రబాబుకి లేఖ రాయటం చర్చకు దారి తీసింది.
అంతే కాదు, మీకు ఏమైనా ఆధారాలు ఉంటే సీల్డ్ కవర్ లో మాకు పంపించండి, మేము విచారణ చేస్తాం అంటూ డీజీపీ ఆ లేఖలో తెలిపారు. దీంతో ఈ లేఖ పై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం చెప్పారు. "సీల్డ్ కవర్ లో సాక్ష్యాధారాలు పంపాలని డిజిపి నాకు లేఖ రాయడం హాస్యాస్పదం. నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట..ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా..? దళితులపై ఈ విధమైన గొలుసుకట్టు దాడులు, ఆలయాలపై దాడులు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా..? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా..? కొందరు పోలీసుల ఉదాసీనత చూసి నేరగాళ్లు రెచ్చిపోతున్నారు." అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతే కాదు, ఘటన జరిగిన రోజున రాజకీయాలకు సంబంధం లేదని డీఎస్పీ చెప్పారని, కుమార్ రెడ్డి అనే వైసీపీ సానుభూతి పరుడు పై కేసు నమోదు చేసామని చెప్పి, సాయంత్రానికి ప్రతాప రెడ్డి అనే టిడిపి కార్యకర్త పేరు తెచ్చారని, వ్యవస్థలను ఏవిధంగా మేనేజ్ చేస్తున్నారో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని చంద్రబాబు అన్నారు.