రాజధాని అమరావతి పై రోజు వారీ విచారణ మొదలైంది. రాజధాని అమరావతికి సంబంధించిన కేసులు అన్నీ వర్గీకరణ చేసి, నేటి ఉదయం 10.30 గంటల నుంచి విచారణ ప్రారంభం అయ్యింది. మధ్యానం వరకు విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా, పలు కీలక అంశాల పై చాలా హాట్ హాట్ గా వాదనలు జరిగాయి. అటు పిటీషనర్ తరుపున న్యాయవాదులు, ప్రభుత్వం తరుపున న్యాయవాదులు తమ వాదనలు గట్టిగా వినిపించారు. ఈ రోజు ఉదయం, విచారణ మొదలైన వెంటనే అనేక అంశాలను కోర్టు విచారణకు తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ను వైజాగ్ లో 30 ఎకరాల్లో కట్టటం పై చర్చ జరిగింది. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8, ఎక్కడైతే సియం ఉండి పని చేస్తారో అదే క్యాంప్ ఆఫీస్ గా, నిర్ణయిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. గత ముఖ్యమంత్రికి కూడా రెండు క్యాంప్ ఆఫీస్ లు ఉన్నాయని, ఆయన ఈ సందర్భంలో ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని, కోర్టుకు చెప్పారు. క్యాంప్ ఆఫీస్ కు సంబంధించి, ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏ నిబంధనలు ఉన్నాయో, పూర్తి సమాచారం ఇవ్వాలని, ధర్మాసనం, ఏజీని ఆదేశించింది. విశాఖ గెస్ట్ హౌస్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసారు. అలాగే ఇక వేరే కేసు విషయంలో, టిడిపి నేత దీపక్ రెడ్డి వేసిన పిటీషన్ లో, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాల పై వేసిన కేసులో కూడా విచారణ జరిగింది. రెండు బిల్లుల విషయంలో శాసనమండలిలో ఏమి జరిగింది, ఆ ప్రొసీడింగ్స్ తమకు కావాలని పిటీషనర్ తరుపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్ అడిగారు, లైవ్ ప్రసారాలు ఆపేసిన విషయం కోర్టు ముందు ఉంచారు. దీంతో ఆ వీడియో టేప్లు ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఆ రెండు రోజుల్లో శాసనమండలిలో ఏమి జరిగిందో చూస్తామని కోర్టు చెప్పింది. అయితే కోర్టు కనుక ఇవి చూస్తే ఆ రోజు సెలెక్ట్ కమిటీ వేసారా లేదా, అసలు ఏమి జరిగింది అనే మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాసం ఉంది. ఇక మరో పక్క అన్ని కేసుల్లో స్టేటస్ కో కొనసాగుతుందని హైకోర్టు చెప్పింది.