భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)), కేంద్రానికి లేఖ రాస్తూ, డిస్కోమ్ లిక్విడిటీ ప్యాకేజీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే 90,000 కోట్ల రూపాయల వాటాను, తమ బకాయలు తీర్చే దాకా ఇవ్వద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్కె సింగ్ కు రాసిన లేఖలో, ఏపి డిస్కోమ్‌లు నిలిపివేసిన మొత్తాన్ని పునరుత్పాదక విద్యుత్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయలు, పూర్తిగా చెల్లించే వరకు డిస్కోమ్‌ల లిక్విడిటీ ప్యాకేజీ కింద ఏమైనా పంపిణీ చేయడాన్ని ఆపివేయాలని సిఐఐ మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తుంది, అని సిఐఐ తన లేఖలో తెలిపింది. ఈ ఏడాది మే నెలలో, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించడానికి 90,000 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలైలో, ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే చేసుకున్న పవన, సౌర ప్రాజెక్టుల అగ్రిమెంట్ల పై తిరిగి సమీక్ష జరపాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం సంతకం చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించబోమని, వీటిని సమీక్ష చేస్తాం అని చెప్పటం, అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం పై కంపెనీలు, కోర్టుకు వెళ్ళిన తరువాత ,హైకోర్టు డిసెంబరులో రావాల్సిన బకాయిలను చెల్లించాలని చెప్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై స్టే ఆర్డర్ జారీకి ఆదేశించింది. సోలార్ కు యూనిట్‌కు 2.44 రూపాయలు, విండ్ డెవలపర్లకు యూనిట్‌కు 2.43 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో 2,500 కోట్ల రూపాయలను విడుదల చేసింది, ఇది 40 శాతం బకాయిలు మాత్రమే. అప్పటి నుంచి మిగతా 60 శాతం పెండింగ్ ఉంటూ వచ్చింది. సిఐఐ అంచనా ప్రకారం, మరో రూ .1,000 కోట్లు వెంటనే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఏపి ప్రభుత్వ నిర్ణయంతో, కంపెనీలు ఎంతో నష్టపోయాయని సిఐఐ తెలిపింది. ఒప్పందాలు రద్దు అనేది చట్టబద్ధమైనవిగా పరిగణించబడవు అని లేఖలో పేర్కొన్నారు. గత వారం ఈ విషయం పై జోక్యం చేసుకోవాల్సిందిగా, ఆయా కంపెనీలు కేంద్రానికి లేఖ రాసాయి. ఇప్పటికే ఈ విషయం కోర్టుల్లో నానూతూ ఉందని, కోర్టు ఆదేశించినా పూర్తి బకాయలు చెల్లించలేదని, కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాసారు. ఇప్పుడు తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) కూడా కేంద్రానికి లేఖ రాయటమే కాక, మా బకాయలు చెల్లించే వరకు, ఇవ్వద్దు అని కేంద్రాన్ని కోరింది.