ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల రగడ గత కొంత కాలంగా కొనసాగుతుంది. చట్టబద్ధమైన అగ్రిమెంట్ చేసుకుని కూడా, అమరావతి రైతులకు నష్టం కలిగించే విధంగా, రాజధానిని మూడు ముక్కలు చెయ్యటం, గత 260 రోజులుగా అమరావతి ఉద్యమం కొనసాగటం, అలాగే వివిధ కేసులు న్యాయస్థానాల ముందు ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో రొటీన్ వ్యవహారం అయిపోయింది. అమరావతి రైతులు అన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా వారి గురించి ప్రభుత్వం పట్టించుకోక పోగా, ఎంత తొందరగా విశాఖ వెళ్ళిపోదామా అనే ఆతృతలో ఉంది. ఇందులో భాగంగానే, కోర్టులలో కేసులు ఉన్నా, కోర్టు స్టేటస్ కో ఇచ్చినా, వేరే విధానాల్లో వైజాగ్ లో పనులు సాగిపోతున్నాయి. ఇందులో భాగంగా, వైజాగ్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్ పేరిట భారీ నిర్మాణం జరుగుతుంది. 30 ఎకరాల్లో ఈ భారీ నిర్మాణం జరుగుతుంది. సహజంగా ఎక్కడైనా ఇలాంటి గెస్ట్ హౌస్ లో, మహా అయితే ఒక 5 ఎకరాలు ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం, భారీగా 30 ఎకరాల్లో కడుతున్నారు. అయితే ఇది గెస్ట్ హౌస్ కాదని, ఆ పేరుతో నిర్మాణం జరుగుతున్నా, ఇక్కడ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరుగుతుందని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కంటెంప్ట్ అఫ్ కోర్ట్ అంటూ, కోర్టు దృష్టికి తేగా, కోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇచ్చిన మూడు గంటల్లోనే, ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది.
విశాఖపట్నంలోని తొట్లకొండ వద్ద, గ్రేహౌండ్స్ కి ఇచ్చిన 300 ఎకరాల్లో, 30 ఎకరాలు గెస్ట్ హౌస్ కి బదలాయించాలని, అత్యవర ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మొత్తం పరిణామం పై, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసారు. తొట్లకొండలో ఉన్న పురావస్తుశాఖ స్థలాల్లో, ఎలాంటి నిర్మాణాలు జరగకూడదు అని, ఇది చట్టానికి విరుద్ధం అని లేఖలో తెలిపారు. 1978లో ఇచ్చిన జీవో ప్రకారం, తొట్లకొండలో 3,300 ఎకరాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయని, 2016లో కూడా ఇక్కడ ఏ నిర్మాణాలు చెయ్యవద్దు అని హైకోర్టు ఇచ్చిన తీర్పుని గుర్తు చేసారు. అయితే కొందరు సీనియర్ అధికారులు ఇక్కడ కేవలం 120 ఎకరాలే పురావస్తు శాఖవి అంటూ, మిగిలిన భూమి మొత్తం ప్రభుత్వానిదే అని, తాము అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం అని తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇక్కడ సర్వే నంబర్లు మార్చేసి, ఈ భూమి అది కాదని, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారని, అలా కుదరదని అన్నారు. ఈ భూమిలో ఎలాంటి నిర్మాణం జరగటానికి కుదరదని, రికార్డులు అన్నీ పరిశీలించి, వాస్తవాలు తెలుసుకని, ఇచ్చిన ఉత్తర్వులని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో తెలిపారు.