ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ప్రభుత్వం పై, అధికారుల పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అందరికీ ఇళ్ళు పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంటు స్థలాన్ని, పేదలకు ఇస్తాను అంటూ చెప్పింది. అయితే కొన్ని చోట్ల ముంపు భూములు, మైనింగ్ భూములు, స్కూల్ బిల్డింగ్స్, పశువుల మేత కోసం వేసిన భూములు, కొండలు, స్మశానాలు, ఇలా ఎక్కడ పడితే అక్కడ, చట్ట విరుద్ధంగా, ఇచ్చాం అంటే ఇచ్చాం అనే విధంగా, ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి సిద్ధం అయింది. అలాగే రాజధాని అమరావతిలో రైతులు, రాజధాని నిర్మాణం కోసం భూమి ఇస్తే, అవి కూడా పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివి ఒక రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు ఉంటాయి. ఇవన్నీ తదితర పార్టీల వాళ్ళు కోర్టుల్లో కేసులు వెయ్యటంతో, ప్రతి విషయంలో కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇవి మాత్రం ఆపి, ప్రభుత్వం చెప్తున్నట్టు మిగతా 40 వేల ఎకరాలు పంచ వచ్చు. కానీ కోర్టు కేసుల వల్ల ఆపెస్తున్నాం అంటూ, మొత్తం పంపిణీ ఆపేసి, ప్రతిపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నాయి అంటూ రాజకీయ ఆరోపణలు భారీగా చేస్తున్నారు. అయితే నిన్న మరోసారి విశాఖలోని గబ్బాడలో చెట్లు నరికేసి, ఇళ్ళ స్థలాల ఫ్లాట్లు కోసం రెడీ చేస్తున్నారని, ఆర్.గంగునాయుడు అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. చెట్లు నరికివేతను అడ్డుకోవాలని, హైకోర్టులో అపీల్ చేసారు.
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. తమ దృష్టికి వచ్చిన కొన్ని పిటీషన్లలో ముంపు భూములు ఇళ్ళ స్థలాల పేరిట ఇస్తున్నారని, అలాగే కొన్ని చోట్ల చెట్లు నరికివేస్తున్నారని పేర్కొంది. ముంపు భూములు ఇస్తే తరువాత పేదలు ఇబ్బందులు పడతారు కదా అని పేర్కొంది. అలాగే చెట్లు నరికివేత పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు నరక కూడదని సుప్రీం కోర్టు గతంలో అనేక ఉత్తర్వులు ఇచ్చిందని, అవి ఉల్లంఘించి ఎందుకు చెట్లు నరుకుతున్నారని ? చెట్లు నరకమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు ? ఆ ఫైల్ తమ ముందు పెట్టాలని ఆదేశించింది. ఇక నుంచి చెట్లు నరికివేత ఆపేయాలని, తమ దృష్టికి ఈ అంశం మళ్ళీ వస్తే ముఖ్య కార్యదర్శి బాధ్యత వచించాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే అధికారులు ఏమి చేస్తున్నారో చూడకుండా, తమ పైనే నిందలు మోపుతున్నారు అంటూ, ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇక పై చెట్లు ఎక్కడ నరకం అంటూ, తమకు అఫిడవిట్ రూపంలో దాఖలు చెయ్యాలని చెప్తూ, ఈ కేసుని నాలుగు వారాలు వాయిదా వేసింది.