రాష్ట్ర రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలా.. లేదా అనే ఆప్షన్లను టిక్ చేయడం ద్వారా తమ అభిప్రాయం తెలపవచ్చని ఆయన సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి చంద్రబాబు http://apwithamaravati.com/ వెబ్ సైట్ ను ప్రారంభించి మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో, ఈ వెబ్సైటుకు 2 లక్షల మంది వచ్చి ఓటు వెయ్యగా, దాదాపుగా 90 శాతం మంది అమరావతికి అనుకూలంగా ఓటు వేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న విధ్వంసకర నిర్ణయాలతో రాష్ట్రం నాశనమవుతోందని ఆరోపించారు. 15 నెలల పాలనలో ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేయలేదని, కనీసం ఒక రోడ్డు కాని, ఒక నిర్మాణం కాని చేపట్టలేదని విమర్శించారు. రాజధానిని తరలించి, మూడు ముక్కలాట ఆడే అధికారం జగన్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పనిసరిగా అమరావతిని అభివృద్ధి చేసి తీరాలని, గత ప్రభుత్వం రాజధానిపై తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. రైతులు ఒకే రాజధాని అయిన అమరావతికే భూములిచ్చారు. కానీ, మూడు రాజధానులకు కాదని కుండబద్దలు కొట్టారు.
అమరావతి కోసం భూములిచ్చిన వారికి పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తే.. హ్యాపీనెస్ట్ హౌసింగ్ కాంప్లెక్స్ట్ వంటి ప్రాజెక్టుల ప్రాంతంలో ఎకరానికి రూ. పది నుంచి 12 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మూడు ముక్కల రాజధాని పేరిట ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మెజారిటీని కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి పై ముందు నుంచి విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ముందుగా అమరావతికి వరదలు వస్తాయి అని తప్పుడు ప్రచారం చేసారని, కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో, అమరావతి వరద ప్రాంతం కాదని చెప్పారని చెప్పారు. ఇక తరువాత అమరావతికి లక్ష కోట్లు అవుతాయని, అమరావతిలో నిర్మాణం ఖర్చు ఎక్కువని, అమరావతి ఒక కులం కోసం అని, అమరావతి మునిగిపోతుందని, ఇలా అనేక ఆరోపణలు చేసారని, అమరావతి పై విషం చిమ్మరని చంద్రబాబు ఆరోపించారు.