విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలోని హెటిరో ఫర్మా కంపెనీకి అడ్డగోలుగా ప్రభుత్వం భూములు అప్పగించే కార్యక్రమం చాపకిందనీరులా ప్రారంభించింది అనే ఆరోపణలు వస్తున్నాయి. తమ డ్రగ్స్ యూనిట్ విస్తరణ కోసం, 108 ఎకరాలు కావాలని, జగన్ ప్రభుత్వానికి హెటిరో కంపెనీ దరఖాస్తు చేసుకుంది. తమ పరిశ్రమ విస్తరణ కోసం ఇంటర్నల్ రోడ్లు, కల్వర్టుల ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ భూమి తమ కంపెనీకి అవసరమని ఆ దరఖాస్తులో పేర్కొంది. అయితే, కంపెనీ కోరిన భూమిలో దేవాలయలాకు సంబందించిన భూములు, డీ-పట్టా భూములు, అలాగే చెరువు గర్భాలు, శ్మశానం భూములు, గెడ్డలు, పోరంబోకు భూములు, బంజరు భూములు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక మరో విషయం ఏమిటి అంటే, కంపెనీకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల్లోని 50 ఎకరాలకు పైగా ఇప్పటికే ఆక్రమించుకొని వినియోగించుకుంటున్నారని అభియోగం కూడా ఉంది. ఈ ఉల్లంఘన పై గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో, ఈ విషయం పై విచారణ కూడా జరిగింది. అయితే విచారణ కమిటీ సమర్పించిన నివేదికను, ఇప్పటి వైసిపీ ప్రభుత్వం పట్టించుకోకుండా హెటిరోకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న, అంటే క-రో-నా పీక్స్ లో ఉన్న సమయంలో, కంపెనీకి భూమి బదలాయింపు ప్రతిపాదన పై పంచాయతీల తీర్మానం, అభ్యంతరాల స్వీకరణకు, విశాఖ కలెక్టర్ ఆదేశాలు ప్రకారం, నక్కపల్లి తహశీల్దార్ వి.వి.రమణ నోటీసులు ఇచ్చారు.
ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి కాబట్టి, ఈ తీర్మానాలకు ఎటువంటి ఆటంకం ఉండవని భావించినా, హెటిరోకు భూములు ఇవ్వవద్దంటూ నల్లిమట్టిపాలెం, ఎన్.నర్సాపురం, ఉప్మాక, సిహెచ్ఎల్.పురం, రాజయ్యపేట గ్రామల ప్రజలు అధికారులకు విన్నవించుకుంటూ, వినతి పత్రాలు ఇచ్చారు. అయితే వీటిని పట్టించుకోకుండా, హెటిరో కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు అధికారులు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరం ధర రూ.25 లక్షలు ఉంటే, 2016లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన జిరాయితీ భూమికి చెల్లించిన రూ.18 లక్షల ధరను రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుత ఉన్న ధర ప్రకారం అత్యంత విలువైన 108 ఎకరాల భూమికి కేవలం రూ.19.44 కోట్లు విలువ కట్టినట్టు తెలుస్తుంది. భూమి విలువలోనే లబ్ది పొందేలా ప్లాన్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ పని పై, ఇప్పటికే పలువురు ఆందోళన బాట పట్టారు. దీని పై ఉద్యమిస్తాం అని అంటున్నారు. మరో పక్క కలెక్టర్ మాత్రం, నివేదిక మాత్రమే ఇప్పటికి ప్రభుత్వానికి ఇచ్చాం అని, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.