ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై, ఈ రోజు సుప్రీం కోర్టులో కీలక విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్ పై ఈ రోజు సుప్రీంలో విచారణ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కు ఎదురు అయ్యింది. ఏపి ప్రభుత్వ పిటీషన్ ను సుప్రీం కొట్టేసింది. ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని, అక్కడ విచారణలో ఉన్నందున, మేము ఏమి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పటికే సిఆర్డీఏ రద్దుతో పాటు, వికేంద్రీకరణ బిల్లు పై, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, హైకోర్టుకు వెళ్ళారు. అయితే హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా, ఈ బిల్లుల పై స్టేటస్ కో ఇస్తూ, హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రెండు వాయిదాలలో కూడా, స్టేటస్ కో ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే, హైకోర్టు ఈ కేసు పై 27 వరకు స్టేటస్ కో విధించారు. అయితే దీని పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. అత్యవసరంగా ఇది విచారణ చెయ్యాలని సుప్రీం కోర్టుని విజ్ఞప్తి చేసినా, ఇది లేట్ అవుతూ వచ్చింది. ఒకసారి ప్రభుత్వం వేసిన పిటీషన లో తప్పులు ఉండటంతో, సుప్రీం కోర్టు పిటీషన్ ని తిప్పి పంపించింది. తప్పులు సరి చేయమని కోరింది. తరువాత తప్పులు సరి చేసి ప్రభుత్వం పిటీషన్ వేయగా, మొదటిగా ఈ కేసు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ముందుకు ఈ కేసు వచ్చింది.
అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూతురు, అమరావతి రైతుల తరుపున హైకోర్టులో వాదనలు వినిపించారని, చీఫ్ జస్టిస్ కు తెలపటంతో, నైతికంగా ఈ కేసు నా ముందుకు వద్దు అంటూ, చీఫ్ జస్టిస్ ఈ కేసుని, వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. రెండో సారి ఈ కేసు జస్టిస్ నారీమన్ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా జస్టిస్ నారిమాన్ తండ్రి, అమరావతి పరిరక్షణ సమితి తరుపున వాదనలు వినిపిస్తూ ఉండటంతో, నారీమన్ కూడా, ఈ కేసు నేను వినటం సమంజసం కాదు అంటూ, వేరే బెంచ్ కు ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసారు. ఇలా రెండు సార్లు మారి మూడో బెంచ్ కు ఈ కేసు వచ్చింది. అయితే ఈ కేసు రేపు అంటే, ఆగష్టు 27న సుప్రీం కోర్టు ముందుకు రావలసి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ, హైకోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి, ఒక రోజు ముందే ఈ కేసు వినాలని సుప్రీం కోర్టుని కోరటంతో, ఈ కేసు ఈ రోజుకు ప్రీపోన్ అయ్యింది. ఈ రోజు ఈ కేసు విన్న ధర్మాసనం, ఈ ఆదేశాలు ఇచ్చింది. రేపు హైకోర్టులో ఈ కేసు పై, తదుపరి విచారణ ఉంది. మరి రేపు హైకోర్టు ఈ కేసు పై స్టేటస్ కో కొనసాగిస్తుందా, లేక స్టేటస్ కో ఎత్తేసి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అనేది చూడాలి. మొత్తంగా ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో, ఊరట లభించింది.