న్యాయమూర్తుల పై సోషల్ మీడియా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పై పూర్తి విచారణ జరిపి ఎనిమిది వారాల్లోగా తమకు నివేదిక అందించాలాని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కాలంలో కూడా హైకోర్టు పై, న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ కోర్టు ఆదేశించింది. అలాగే సిబిఐకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. దీంతో దీని పై సిబిఐ కేసు నమోదు అయిన వెంటనే, రెండు నెలల్లోగా ఈ కేసు పై విచారణ జరిపి, హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఈ కేసు పై పోయిన వారం విచారణ జరిగిన సందర్భంలో, సిఐడి ఈ కేసులో సాధించిన పురోగతి పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 90 మందికి పైగా పేర్లు ఇస్తే, 20 మందిని కూడా విచారణ చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేసిన వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఇది కావాలనే కోర్టుల పై కుట్ర పన్నినట్టు తెలుస్తుందని, దీని వెనుక ఉన్న కుట్రను తేలుస్తామని, ఇది ఇలాగే కొనసాగితే, కోర్టుల పై నమ్మకం పొతే సివిల్ వార్ కు దారి తీస్తుందని హెచ్చరించింది.
ఈ కేసులో సిఐడి పని చేయలేకపోతే , బెటర్ ఇన్వెస్టిగేషన్ కి ఇవ్వాల్సి వస్తుందేమో అని కోర్టు వ్యాఖ్యానించటంతో, తమకు సిబిఐకి ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరుపు న్యాయవాది. దీంతో ఈ రోజు ఈ కేసు విచారణ మళ్ళీ రావటంతో, ఈ కేసు పై నిర్ణయం తీసుకున్న హైకోర్టు, సిఐడి సరిగ్గా పని చేయలేదని భావించి, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. అయితే ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే, గతంలో హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల పై, వైసిపీ సోషల్ మీడియా, నాయకులు కలిసి సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పై , కోర్టు ల పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. దీంతో ఇవన్నీ చూసిన హైకోర్టు రిజిస్టార్, దీని పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పూర్తీ ఆధారాలు కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసుని సిఐడిని విచారణ చేయమని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ సందర్భంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, మా వాళ్ళను మేము కాపాడుకుంటామని, తాను సోషల్ మీడియా ఇంచార్జ్ ని అంటూ చెప్పటం వివాదాస్పదం అయ్యింది. అయితే కోర్టులో కేసు ఉన్నా, నేటికి వైసిపీ సోషల్ మీడియాలో ఇప్పటికీ కోర్టుల పై, న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారి పై కూడా కేసు పెట్టమని హైకోర్టు చెప్పింది.