అమరావతి పై ఇప్పటికే 230 పిటీషన్ల దాకా హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఈ కేసులను 18 విభాగాలుగా విభజించిన హైకోర్టు, వీటి పై ఇప్పటికే విచారణ ప్రారంభించింది. అనుబంధ పిటీషన్ల పై విచారణ కూడా ముగిసి, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. ఇప్పటికే రోజు వారీ విచారణ కూడా ప్రారంభం అయ్యింది. అయితే ఇక మెయిన్ పిటీషన్ పై వాదనలు, నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు వాదనలు జరిగే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో హైకోర్టులో ఈ రోజు మరో ఆసక్తికర పిటీషన్ దాఖలు అయ్యింది. అమరావతి రాజధాని విషయం పై కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలి అంటూ, విఎల్ కృష్ణా అనే ఒక లా స్టూడెంట్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చిందని పిటీషన్ లో తెలిపారు. అలాగే రైతులతో కుదుర్చుకున్న ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని, అందుకే ఈ కేసు ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాల్సిందిగా కోరారు. గతంలో అన్ని ప్రముఖ కేసులు పై లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వచ్చు అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుని ఉదాహరించారు.
అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా మాట మార్చింది, శాసనసభ, మండలిలో ఏమి జరిగింది, మిగతా అంశాలు అన్నీ ప్రజలకు తెలిసే అవకాశాలు ఉన్నాయని పిటీషన్ లో తెలిపారు. రాష్ట్ర ప్రజానికానికి, ఇప్పటికీ ఈ కేసుల పై పూర్తి అవహగన లేదని, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఒక సైడ్ తీసుకుని వచ్చే వార్తలతో, ప్రజలకు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదని అన్నారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన కొన్ని ఆర్టికల్స్ ని పిటీషన్ లో ఉదాహరించారు. అలాగే ఈ కేసులో వచ్చే తీర్పు ఏ రాజకీయ పార్టీకి, గెలుపు, ఓటమి కాదు అంటూ, అలా చర్చించకూడదు అంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హైకోర్టుని తప్పుగా చుపెట్టేలా పోస్టింగ్ లు ఉంటున్నాయని, హైకోర్టుని పార్టీలకు అంటగట్టి మాట్లాడుతున్నారని, అలాంటి వారిని శిక్షించాలని కోరారు. ఈ నేపధ్యంలోనే కేసు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే, అసలు ఏమి జరుగుతుంది, మంచి చెడులు ప్రజలే నిర్ణయం తీసుకుంటారని తన పిటీషన్ లో కోరారు.