విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని మంగళవారం హవాలా రాకెట్ ను చేధించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి విజయవాడతో లింకు ఉండి హైదరాబాద్ వరకు హవాలా రాకెట్ నడుస్తోంది. ఇలా ఎన్నాళ్ళనుంచి నడుస్తోందో తెలియదు కాని, బంగారు వ్యాపారి ప్రవీణ్ జైన్, ఆతనితోపాటు చామకూరి హరిబాబు, వల్లూరి శివప్రసాద్, చామకూరి అనందరావులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించిన వివరాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చామకూరి అనందరావు, చామకూరి హరిబాబు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు కూడా దేవి జ్యూయలరి మాలో పనిచేస్తున్నారు. జ్యుయలరీ యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ వారిద్దరికి రూ. 50 లక్షల దేశీయ నగదు, సుమారు 25 లక్షలు విలువ చేసే 34 వేల యుఎస్ డాలర్లను ఇచ్చారు. ఈ మొత్తంతో పాటు విజయవాడకు చెందిన శివనాధ్ నుంచి రూ. 50 లక్షలు, భరత్ నుంచి రూ. 20 లక్షలు, ఉత్తమ్ నుంచి రూ 15 లక్షలు, దివాకరనుంచి రూ 12 లక్షలు మొత్తం రూ 1.47 లక్షలు సేకరించి వాటితో పాటు 34 వేల అమెరికన్ డాలర్లను తీసుకుని హైదరాబాద్ లో ఉన్న తన సోదరుడు కీర్తికి ఇచ్చి రమ్మని ప్రవీణ్ కుమార్ జైన్ ఇద్దరు గుమస్తాలకు చెప్పారు.
దీంతో నగదును తీసుకుని ఏపీ 37 బిడబ్యు 4532 నెంబరు కారులో బయలుదేరారు. కారులో వెనుక సీట్లలో ప్రత్యెక బాక్సులలో నగదును ఉంచి బయలుదేరారు. సమాచారం తెలిసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేజింగ్ చేసి భవానీపురం వద్ద అడ్డుకుని నగదును స్వాధీనం చేశారు. భూనీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ జైన్ పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ డాక్టర్ కె వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎసీపీ టి కనకరాజు, వి ఎస్ ఎన్ వర్మ, ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్, సిబ్బంది హవాలాను చేధించారు. పోలీసు కమిషనర్ వారందరని అభినందించారు. నెల రెండు నెలల క్రితం కూడా, ఇలాంటి హవాలా కుంభకోణమే ఒకటి బయట పడింది. తరుచుగా ఈ హవాలా ర్యాకెట్ లు బయట పడటంతో, పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు.