మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్ గారు, గతంలో మీడియా సాక్షిగా చెప్పిన మాటలు, అసెంబ్లీ సాక్షిగా చెప్పినా మాటలు, పాదయాత్ర సాక్షిగా చెప్పిన మాటలు మర్చిపోయి, అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందూస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, అమరావతి కోసం 30 వేల ఎకరాలు అవసరం లేదని, 500 ఎకరాలు చాలని అన్నారు. అంతే కాదు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సు సిటీ కాదని, దాని కోసం లక్ష కోట్లు ఖర్చు అవుతాయని, అంత డబ్బు అప్పు తెచ్చి ఆ సిటీ కడితే, అసలు కాదు కానీ, అసలు వడ్డీనే కట్టలేం అంటూ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ పెద్ద సిటీల వల్ల లాభం లేదని అన్నారు. ఉదాహరణకు విశాఖపట్నం చిన్న పట్టణంగా ఉన్నప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందని, ఇప్పుడు విశాఖ ఎదిగిన సిటీ అని అన్నారు. కరోనా అనుభవం తెలిసింది ఏంటి అంటే, పెద్ద సిటీలు బలహీన పడ్డాయని అని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో టాప్ 10 డెవలప్ అయిన దేశాలు తీసుకుంటే, వారికి అసలు మెగా సిటీలు లేవని అన్నారు. పెద్ద సిటీలు ఎక్కువ ఇన్కమ్ తెస్తాయి అనేది తప్పు అని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ సిటీలు ఎక్కడా డెవలప్ కాలేదని అన్నారు. అమరావతి కట్టటానికి డబ్బులు లేవని అన్నారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని అన్నారు.
అయితే ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన మాటలను, ఈ మాటలను పోల్చి చేసిన అమరావతి ప్రజలు, జగన్ గారు మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే మాట అబద్ధం అని అన్నారు. జగన్ గారు మాట తప్పారు, మడమ తిప్పారని అంటున్నారు. ఇప్పుడు రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు అంటున్న జగన్ గారు, అసెంబ్లీ సాక్షిగా రాజధాని అంటే, 30 వేల ఎకరాలు ఉండాలని ఎందుకు చెప్పారని, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అసలు పెద్ద సిటీలు అవసరం లేదని అని చెప్పిన జగన్ గారు, 2014 మ్యానిఫెస్టోలో, మనకు ఒక పెద్ద నగరం కావాలి, ఆ రాజధాని నేను కడతాను అని ప్రణాలికాలు ఎందుకు రచించారు అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద సిటీలు నుంచి ఆదాయం రాదు అని ఇప్పుడు చెప్తున్న జగన్ గారు, గతంలో హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే రాష్ట్రం మనకు పోయింది, మనకు అలాంటి ఆదాయం ఇచ్చే రాజధాని కావాలి అని ఎందుకు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులు మంచిది అని ఇప్పుడు చెప్తున్న జగన్ గారు, గతంలో రాజధాని అమరావతి మధ్యలో ఉండాలి, నీళ్ళు ఉండాలి, 30 వేల ఎకరాలు భూమి ఉండాలి, అప్పుడే అది రాజధాని అని ఎందుకు చెప్పారని ప్రశ్నిస్తున్నారు.