టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ రోజు కొల్లు రవీంద్రను పరామర్శించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ, 40 మంది ఎమ్మెల్యేల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "మమ్మల్ని అకారణంగా ఇబ్బంది పెడుతున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. తరువాత మర్చిపోతారులే, 2024వరకు మమ్మల్ని ఏమి చెయ్యలేరులే అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఆలోచించుకోండి. మా పై ఆధారాలు ఉంటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏదో బురద చల్లుతాం, మీకు కడుక్కోండి అంటే కుదరదు. మీ అరాచకాల పై పోరాడతాం. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అని ఊదరగొట్టి, ఇప్పుడు ఇవ్వలేకపోయాడు, ప్రజలు అడుగుతున్నారని ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయి, కొడాలి నాని బూతులు మాట్లాడుతున్నాడు. రైతులని తిడతాం, ప్రజలను తిడతాం, నాయకులని తిడతాం అంటే ఎందుకో అర్ధం కావటం లేదు. మంత్రులు అందరినీ ఎందుకో మరి, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇళ్ళ పట్టాలు ఆపాం అని అంటున్నారు, అక్కడ ప్రజలు తమ భూములు లాక్కున్నారని కొన్ని చోట్ల కోర్టుకు వెళ్ళారు. నాలుగు అయిదు చోట్ల వెళ్ళారు, రాష్ట్రం అంతా వెళ్ళలేదు కదా ? కోర్టు ఆ నాలుగు అయిదు చోట్ల ఆపింది, రాష్ట్రం అంతా ఆపలేదు కదా, అక్కడ పేదలకు భూములు ఎందుకు పంచటం లేదు ? ఇళ్ళ స్థలాల స్కాంలో 40 మంది ఎమ్మెల్యే ఆధారాలతో దొరికారు, వీరందరూ జైలుకు వెళ్తున్నారు, రాసి పెట్టుకోండి, టైం అంతే, కచ్చితంగా వీళ్ళు జైలుకు వెళ్తారు."
"అంతర్వేది విషయం అనేది, ఇది ఒక విషయం కాదు. మతసామరస్యం ఉండాల్సిన చోట, ఏపిలో ఏమి జరుగుతుంది ? ఒక మతాన్ని టార్గెట్ చెయ్యటం లేదా ? నెల్లూరులో ఇలాగే ఒక రధం తగలబెడితే, ఒక పిచ్చి వాడు చేసాడు అని తేలికగా తీసేసారు, మరి ఈ రోజు ఎందుకు సమాధానం చెప్పటం లేదు ? ఈ రోజు గుడిలో విగ్రహాలు కూడా ధ్వంసం చేసే స్థాయికి వచ్చారు. అనేక జిల్లాలో ఇలాగే జరుగుతుంది. నిన్న గుంటూరులో ఒక అర్చకుడిని చితకబాదారు. అందుకే ఈ అంతర్వేది ఘటన పై సిబిఐ ఎంక్వయిరీ అడుగుతుంది. వెల్లంపల్లి ఒక చేతకాని మంత్రి. ఇవి వరుస ఘటనలు. నిన్న కూడా అక్కడకు వెళ్లి చంద్రబాబు అని మంత్రి అంటున్నాడు. వీరికి కలలో కూడా చంద్రబాబు గారే కనిపిస్తున్నారు. వీరికి వీరి నాయకుడు అయిన జగన్ రెడ్డి గుర్తుకు రావటం లేదు, ఎంత సేపు చంద్రబాబు నామ స్మరణ. ఒకసారి జరిగితే ఎదో ఆక్సిడెంట్ అనుకుంటారు, వరుస బెట్టి జరుగుతుంటే, చంద్రబాబు అంటారు. నువ్వు చేతైన వాడివి అయితే, జరుగుతున్న ఘటనల పై ఆక్షన్ తీసుకోండి." అని నారా లోకేష్ అన్నారు.