కుప్పం: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న అరాచకపాలనపై గళమెత్తుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళంపేరుతో మహాపాదయాత్రకు తొలి అడుగువేశారు. కుప్పంలోని వరదరాజస్వామిగుడిలో శాస్ర్తోక్తంగా పూజలు చేసిన అనంతరం వేలాది కార్యకర్తల జయజయధ్వానాల నడుమ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 11.03 నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమైంది. తొలి అడుగు వేసే సమయంలో ఆలయం వెలుపల కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ జై లోకేష్, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో హోరెత్తించారు. మామ బాలకృష్ణ, నందమూరి తారకత్న, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు, వేలాదిమంది కేడర్ వెంట నడువగా యాత్ర ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 400రోజులపాటు 4వేల కిలోమీటర్ల పొడవున యువగళం యాత్ర సాగనుంది. పాదయాత్ర ప్రారంభమయ్యాక దారిపొడవునా మహిళలు హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. అడుగడుగో చంద్రన్న బిడ్డ అంటూ కుప్పంవాసులు లోకేష్ ను చూసేందుకు దారిపొడవునా ఎగబడ్డారు. గత 40ఏళ్లుగా చంద్రబాబునాయుడుపై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న కుప్పం వాసులు యువనేత చేపట్టిన మహాపాదయాత్రకు తమ ఆశీస్సులు అందజేస్తూ సంఘీభావం తెలిపారు. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆరేళ్ల బాలల నుంచి వృద్ధులవరకు రోడ్లవెంట నిలబడి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు.
మశీదు, చర్చిల్లో ప్రార్థనలు... అరకిలోమీటరు పాదయాత్ర అనంతరం లక్ష్మీపురం మక్కా మసీదు సందర్శించిన లోకేష్...మశీదులో దువాచేసి ముస్లిం మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత కుప్పం బాబూనగర్ హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్ షిప్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేయగా, పాస్టర్లు, క్రిస్టియన్ మతపెద్దలు దీవెనలందించాచరు. యువగళానికి సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలాడాయి. యువనేత వెంట భారీగా కదిలిన పసుపుదండుతోపాటు స్థానికులను అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టం తరంగా మారింది. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేష్ యువగళానికి కనీవినీ ఎరుగనిరీతిలో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.