కమలంతో కన్నా లక్ష్మీనారాయణ ప్రయాణం ముగిసింది. అయితే ఆయన టిడిపిలో చేరతారా? జనసేనకి వెళతారా? అనే దానిపై స్పష్టత రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2014లో మోదీ నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చానని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినందుకు గర్వపడుతున్నానని తన రాజీనామా సందర్భంగా కన్నా చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంపై ఇప్పటికీ నమ్మకం ఉందని, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని, బీజేపీ ముందుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపులతో సోమువీర్రాజు వ్యవహరిస్తుండడంతో బీజేపీకి రాజీనామా చేశానని తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణని త్వరలో వెల్లడిస్తానని చెప్పిన కన్నా ఏ పార్టీలో చేరతారనేది మాత్రం వెల్లడించలేదు. కన్నా లక్ష్మినారాయణ రాజీనామా ప్రకటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావు స్పందించారు. కన్నా లక్ష్మినారాయణకు బీజేపిలో సముచిత గౌరవం ఇచ్చామని, సోము వీర్రాజుపై వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితంగా చేస్తున్నారని చెప్పారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలు స్పందించేందుకు జీవీఎల్ నిరాకరించారు.
కమలంతో కన్నా కటీఫ్..టిడిపిలో చేరతారా? జనసేనకి వెళతారా?
Advertisements