నాడు శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సిఎం వైఎస్ జగన్ కు ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను మండలిలో ఆధిక్యం ఉన్న తెలుగుదేశం తిప్పి పంపడంతో ఏకంగా మండలి రద్దుకి తీర్మానం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ తరువాత మండలిలో వైసీపీ బలం పుంజుకోవడంతో మండలి రద్దు తీర్మానాన్ని వైసీపీ లైట్ తీసుకుంది. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని టిడిపి అధినేత వైసీపీపై ప్రయోగించారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు ఏకపక్షంగా జగన్ మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. శాసన మండలి వల్ల ప్రజా ప్రయోజనం లేదని, దీనిపై ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగే అని సిఎం జగన్ అనలేదా అని టిడిపి అధినేత నిలదీశారు. మండలి లాంటి వ్యవస్థలను అగౌర పరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి...ఓట్లు అడుగుతారని చంద్రబాబు నాయుడు నిలదీశారు. పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండలి రద్దు వ్యాఖ్యలను అభ్యర్థులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నేతలంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక ఉందని.... అదే సమయంలో తెలుగుదేశానికి అనుకూలంగా పరిస్థితి ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ ఎన్నికలు ఇంచార్జ్ లు, నేతల పరితీరుకు, సమర్థతకు పరీక్ష గా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు లను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
నాడు మండలి రద్దు ..నేడు ముద్దు ఎలా అయ్యింది జగన్?
Advertisements