ముప్పేట దాడి తట్టుకోలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలుస్తోంది. 23 మందిలో నలుగురు పార్టీ నుంచి జంప్ ఇచ్చేశారు. ప్రతిపక్షం పాత్ర నామమాత్రం అనుకుంటే చుక్కలు చూపిస్తోంది తెలుగుదేశం. బాదుడే బాదుడు కార్యక్రమం తరువాత `ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి` చేపట్టింది. అడ్డగోలు సర్కారు నిర్ణయాలను కోర్టులు కొట్టేస్తున్నాయి. కేసులు మెడకి చుట్టుకున్నాయి. ఏ సర్వే చూసినా వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందనే వస్తోంది. ఏం చేయాలో తెలియని ఫ్రస్టేషన్‌తో సీఎం ఉన్నారని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతలు మంత్రివర్గంలో మార్పులు చేసిన జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి అని చెబుతున్నా...అసలు కారణం వేరే అని వైసీపీ నేతలే చెబుతున్నారు. రెండో విడతలో మంత్రి పదవి వస్తుందని ఆశించినా రాని వాళ్లు, మంత్రి పదవి పోయిన వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా వున్నారని కోటంరెడ్డి, ఆనం, సుచరిత వ్యాఖ్యలతో జగన్ ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. మరికొందరు ఎమ్మెల్యేలు జారిపోకుండా మంత్రి పదవులు కట్టబెట్టి సంతృప్తి పరచవచ్చనేది వైసీపీ పెద్దల వ్యూహంగా తెలుస్తోంది. మంత్రులుగా ఎవరున్నా, నిర్ణయాలు తీసుకునేది తన కోటరీయేనని, మంత్రి పదవులు పారేసి..ఓ బుగ్గ కారు పడేస్తే అసంతృప్తి చల్లారుతుందని జగన్ భావిస్తున్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్న కొందరు మంత్రులని తప్పించ వచ్చని, వీరి స్థానంలో మరికొందరు కొత్త వారిని తీసుకోవచ్చని అంటున్నారు. మరోవైపు టిడిపిని ఎవరు ఎక్కువ బూతులు తిడితే వారికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం వైసీపీ సర్కిళ్లలో నడుస్తోంది. దీని ఫలితమే కొడాలి నాని బూతుల డోస్ పెరగడమని అంటున్నారు. గతసారి కూడా చంద్రబాబు ఇంటిపై దాడి చేసి, బూతులు తిట్టిన జోగి రమేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టారు. ఇలాగే తాము బూతులు మాట్లాడితే మంత్రి పదవి దక్కించుకోవచ్చని బరితెగించి మరీ ప్రతిపక్షనేతపైనే బూతులు పేలుతున్నారని వైసీపీలో టాక్ నడుస్తోంది.
తీవ్ర ఒత్తిడిలో జగన్..ఎమ్మెల్యేలు జంప్ కొట్టకుండా మంత్రి పదవులు ఎర
Advertisements