ఇటీవల కాలంలో వైసీపీ కీలక నేతలపై వైసీపీ సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేయడం నెల్లూరు నుంచి ఆరంభమైంది. ముందుగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అసమ్మతి గళం ఎత్తారు. ఆ తరువాత నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్కారు తీరుని ఎండగట్టారు. వెనువెంటనే సీఎం నుంచి పిలుపురావడం, తాడేపల్లిలో తలంటడం జరిగిపోయాయి. అయితే మరోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోను ట్యాప్ చేస్తున్నారని, ఈ విషయం తెలుసుకుని వారికి ఏం కావాలనుకుంటున్నారో అవే మాట్లాడుతున్నానంటూ కుండబద్దలు కొట్టారు. తన దగ్గర చాలా సిమ్‌లు ఉన్నాయని, చేతనైతే వాటిని కూడా ట్యాప్ చేయండి అంటూ సవాల్ విసిరారు. అవసరమైతే నా ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం తెలియడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై చాలా రోజులుగా వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని అర్థమవుతోంది. ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కోటంరెడ్డి కలిశారు. అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన ఎమ్మెల్యేలు అందరిపైనా నిఘా ఉందని ప్రచారం సాగుతోంది.
బాంబు పేల్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంత విధేయుడి పై కూడా జగన్ నిఘా ఎందుకు పెట్టారు?
Advertisements