వైసీపీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తారకరత్న పైకి పోతాడంటూ నవ్వుతూ పైశాచిక ప్రకటన చేశారు. నారా వారి పాదయాత్ర ఆరంభంలో నందమూరి వారసుడు గుండెపోటుతో పోవడం శుభసూచకమంటూ వికృతానందాన్ని బయటపెట్టుకున్నాడు. మరోవైపు నందమూరి కుటుంబంలో ఎవరికి వారుగానే ఉండే వాళ్లంతా ఒక్కసారిగా తమ ఇంటి బిడ్డ కోలుకోవాలని ప్రార్థనలు, పరామర్శలకు వచ్చారు. నందమూరి తారకరత్న రాజకీయంగా పెద్ద అనుభవం లేదు. సినిమా స్టార్‌గానూ పెద్దగా పేరుప్రతిష్టలు లేవు. అన్న నందమూరి తారకరామారావు మనవడిగానే ఈ రెండు రంగాలకీ పరిచయం అయ్యాడు. ఇటీవల కాలంలో రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరిచాడు. యువగళం పాదయాత్రకి నెల రోజుల ముందే సంఘీభావం ప్రకటించాడు. పాదయాత్రలోనూ పాల్గొన్నాడు. తనకు తెలుగుదేశం టికెట్ ఇస్తే పోటీచేస్తానంటూ ఆసక్తి కనబరిచాడు. మామయ్య చంద్రబాబుని మించిన నాయకుడు లేడంటూ తెలుగుదేశంపైనా, సీబీఎన్ నాయకత్వంపైనా అచంచల విశ్వాసం ప్రకటించాడు. అంతలోనే హార్ట్ ఎటాక్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే నందమూరి-నారా కుటుంబాలన్నీ తారకరత్న కోసం నిద్రాహారాలు మాని ప్రార్థనలు చేస్తున్నారు. నేరుగా బెంగళూరు చేరుకుని ఆస్పత్రిలో తారకరత్నని చూసి వస్తున్నారు. మామ చంద్రబాబు, మేనత్త పురందేశ్వరి, బాబాయ్ బాలయ్య, అన్నయ్య మోహన కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బ్రాహ్మిణి,, ప్రణతి, నందమూరి సుహాసిని, మామయ్యలు, అత్తయ్యలు, బాబాయ్‌లు ఒకరేమిటి నందమూరి-నారా కుటుంబాలు మొత్తం తారకరత్న కోసం ఒక్కటయ్యారు. సినిమాలు, వ్యాపారాలు వేరువేరుగా ఉన్నా.. కష్టమొస్తే మేమంతా ఒక్కటేనని ఎన్టీఆర్ కుటుంబం తారకరత్న విషయంలో చాటిచెప్పారు.