విశాఖ విపత్తుల నగరం... హుద్ హుద్ పెను తుపాను తరువాత నగర ప్రజల్లో విపత్తుల పై భయాందోళనలు తలెత్తడం ప్రారంభమైంది. నగరం పై ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రజలను అప్రమత్తం చేయడానికి అనువుగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న కేంద్రమే జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎల్ అండ్ టి కంపెనీ రూ. 120 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్. దీనిని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు... దీని సేవల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదాలు, విపత్తుల సమయంలో నగరం పై పూర్తిస్థాయి పట్టు, నియంత్రణ సాధ్యమయ్యే కేంద్రాన్ని గత ఏడాది కాలంగా స్మార్ట్ సిటీ ప్రతినిధులు కష్టపడి తయారు చేశారు.
ప్రస్తుతానికి ఏడు సేవలు అందుబాటులోకి... విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. నగరీకరణ నేపథ్యంలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో తరచూ జరిగే ప్రమాదాలతో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వాటి నివారణ కోసం మహా విశాఖ నగరంలో 65 ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 200 మీటర్ల వరకు స్పష్టంగా వాహనాల నెంబర్లను సైతం పసిగట్టగలిగే సీసీ కెమెరాలతో దూకుడుగా వెళ్లే వాహన చోదకులను పట్టుకుని, వారి నుంచి అపరాధ రుసము వసూలు చేస్తారు. సిగ్నల్ జంపింగ్ చేసేవారి వాహన సంఖ్య ఆధారంగా జరిమానా చలానా ఇంటికే పంపించే వీలుంది. సీసీ కెమెరాలున్న ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తే, జరిగిన తీరును పోలీసులు చూసుకునే వీలుంటుంది.
అలాగే నగరంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోల్స్ ద్వారా, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసారు... వాటి ద్వారా, ఈ ఏడు సేవలు అందుతాయి... 1. స్మార్ట్ పోల్‌పైన 3 విద్యుత్ లైట్లు ఉంటాయి. ఇవి వాతావరణ పరిస్థితులను బట్టి లైటింగ్ ఇస్తాయి. అంటే రాత్రివేళ ఎక్కువ లైటింగ్ ఉంటే.. తెల్లవారుజాము నుంచి కాంతిని తగ్గించేస్తాయి. 2. స్మార్ట్ పోల్ కు వైఫై డివైజ్ అమర్చి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇస్తుంది. 3. స్మార్ట్ పోల్ పైన రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి 180 డిగ్రీల పరిధిలో దృశ్యాలను రికార్డు చేసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి లైవ్ లో పంపిస్తాయి.. 4.స్మార్ట్ పోల్ పై ఎన్విరాన్‌మెంటల్ సెన్సర్ ఒకటి ఉంటుంది. ఆ స్మార్ట్ పోల్ ఉన్న ప్రాంతంలో గాలి, వాయు కాలుష్య తీవ్రత, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. 5. స్మార్ట్ పోల్ పై నాలుగు స్పీకర్లు ఉంటాయి. విపత్తుల సమయంలో అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడానికి, ఏదైనా అత్యవసర సమాచారం అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 6. ఒక ఆడ్ బోర్డు ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు బోర్డు పై ప్రకటనల కోసం కార్పొరేషన్ ను సంప్రదించవచ్చు. 7.పోల్‌పైన ఏదైనా టెలికాం సంస్థ సిగ్నల్ యాంటీనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. నెట్‌వర్క్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో బలహీనంగా వున్నట్టయితే ఆ పోల్‌పై యాంటీనా ఏర్పాటుచేసుకుంటే సర్వీసును మెరుగుపరుచుకోవచ్చు.