ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి, అత ముఖ్యమైన సీఆర్డీయేకి, రాజధానిలో సొంత భవనాలను సమకూర్చుకుంటోంది.... ఇప్పటివరకు విజయవాడ నగరంలోని లెనిన్ సెంటరు, బందరురోడ్డులలో కార్యాలయాలను నిర్వహించుకుంటున్న సీఆర్డీయే రాజధానిలో సొంతంగా ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించుకుంటోంది. ఇందుకోసం ఆ సంస్థ రూ.34 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికార యంత్రాంగాన్ని రాజధాని అమరావతిలోనే కేంద్రీకరించి పాలనను నడిపిస్తోంది. ఈ క్రమంలో సీఆర్డీయే కూడ సాధ్యమైనంత త్వరగా రాజధాని నుంచే విధులను నిర్వహించాలని నిర్ణయించింది.
ఇందుకోసం తన ప్రధాన కార్యాలయాన్ని రాయపూడి - లింగాయపాలెం మధ్య సీడ్ యాక్సెస్‌రోడ్డు వెంబడే నాలుగెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుంటుంది. సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణం జరుగుతున్న ఈ ప్రదేశం భవిష్యత్తులో రాజధానిలోనే అతిపెద్ద జంక్షన్‌గా మారనుంది. సదరు జంక్షన్‌లో పూర్తి ఈశాన్యంగా ప్రధాన కార్యాలయం నిర్మితమవుతుంది. కార్యాలయానికి తూర్పువైపు ఎన్-11 రోడ్డు, ఉత్తరంగా సీడ్ యాక్సిస్ రోడ్డు(ఇ-3) ఉంటాయి.
సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని రూ.30 కోట్ల వ్యయంతో జీ+7 భవన సముదాయంగా నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగెకరాల విస్తీర్ణంలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా దీనిని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. పీఆర్‌ఈసీఏ కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆరు మాసాల్లోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటే తుళ్లూరులో సీఆర్డీయే యూనిట్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.