ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిన్న కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే... కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ బయటకు వస్తున్నట్టు ప్రకటించారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేంద్ర కేబినెట్‌లో ఉన్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వైదొలగనున్నారు... మరో పక్క ఇదే నిర్ణయం చెప్పటానికి, ప్రధాని మోడీకి ఫోన్ చేసినా, ఆయన అందుబాటులో రాలేదు... అయితే అనూహ్యంగా ప్రధాని మోడీ, కొద్ది సేపటి క్రిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫోన్ చేసారు... వీరిద్దరి సంభాషణ దాదాపు 10 నిమిషాల పాటు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ రోజు ఉదయం రాజస్థాన్‌లో భేటీ పడావో- భేటీ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ఈ సాయంత్రం 4.30గంటలకు తన నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టు సమాచారం. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ప్రధానితో మాట్లాడి తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించగా వీలు పడలేదు. నిన్న మంత్రిమండలి సమావేశం ఉండటం, ఈ రోజు రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో మాట్లాడటం కుదరకపోవడంతో ఈ సాయంత్రం మోదీ చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
. వీరిద్దరి సంభాషణలో ప్రధానంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరి మంత్రుల రాజీనామాకు దారితీసిన కారణాలను చంద్రబాబు వివరించినట్టు సమాచారం. అలాగే, ఇద్దరు మంత్రులు రాజీనామాలు సమర్పించేందుకు మోదీ అపాయింట్‌మెంట్ కోరడంతో.. వారికి మోదీ ఈ సాయంత్రం 6గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఉదయమే ప్రధానికి రాజీనామా లేఖలు అందజేయాలని అనుకున్నా... మోదీ రాజస్థాన్ పర్యటనలో ఉండడంతో కుదరలేదు. దీంతో టీడీపీ కేంద్ర మంత్రులు ఈ సాయంత్రం మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.