సిఐఐ భాగస్వామ్య సదస్సులో హాజరయ్యేందుకు విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం, కిర్లంపూడి లేవుట్లోని తన కుమారు డికి చెందిన ఇంట్లో బస చేశారు. ముఖ్యమంత్రి ఉదయం అక్కడికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి మెలసి పనిచేయాలని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని కేంద్రంతో కూర్చుని పరిష్కరించుకోవాలని వెంకయ్య, చంద్రబాబుకి సూచించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం మంచిది కాదని చంద్రబాబుకు వెంకయ్యనాయుడు సూచించారు.
రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ, చొరవ తీసుకుంటున్నందుకు వెంకయ్యకు ధన్యవాదాలు చెప్తూనే, కొన్ని విషయాలు తెగేసి చెప్పినట్టు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేరిస్తేనే, అందరికీ మంచింది అని, దీని పరి రాజీ లేదని చెప్పారు... కేంద్రంలో బీజేపీతో కలిసింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని, అవి నేరవేరనప్పుడు, ప్రజల ఆకాంక్ష ప్రకారం ముందుకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు... రాష్ట్రంలో ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా, కేంద్రం వైపు నుంచి ఎలాంటి సానుకూల చర్చలు లేవని, చంద్రబాబు తెలిపారు...
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులతో తాను మాట్లాడతానని, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని వెంకయ్యనాయుడు పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెంకయ్యనాయుడు ఇది వరకూ ప్రయత్నం చేశారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల చివరి రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీలతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకి తాను కేంద్ర మంత్రిగా ఉండగా కొంత ప్రయత్నం చేశానని, దానికి కొనసాగింపుగానే ఈ సమావేశం నిర్వహించానని ఆయన అప్పట్లో చెప్పారు.