ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తక్షణమే ఏవైనా నిర్ణయాలు తీసుకుందామా? కొంత కాలం వేచి చూసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుదామా?' అని చంద్రబాబు తమ నేతలను అడిగారు.
బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని మెజార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సమావేశంలో కేంద్రం లీకులపై టీడీఎల్పీలో వాడివేడి చర్చ సాగింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలా?...కొంతకాలం కొనసాగాలా? అని ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయాలు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యేలు.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తేల్చిచెప్పేశారు. అయితే కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పొత్తు కొనసాగాలని చెప్పడం గమనార్హం. 95శాతం మంది పొత్తు వద్దు అనటంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు...
కేంద్రం ఇలా ఎందుకు చేస్తుందో అర్థంకావడం లేదని సీఎం తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని పదేపదే కోరుతున్నామన్నారు. అందరూ హోదా కోసం పట్టుబట్టాలని టీడీపీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రం లీకులపై టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్యేలకు బాబు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పడంతో.. అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొందామని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు.