ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాల పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో టిడిపి, బిజెపి నేతలు సోమవారం రాత్రి పూట ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రెండు రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. మార్చి 5న, ఏపీకి నిదుల కేటాయింపు అంశంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. కానీ, ఈ సమావేశానికి మాత్రం అమిత్‌షా గైరాజరయ్యారు... అయితే ఈ సమావేశంలో, యనమల లేవనెత్తిన రెండు అంశాలకు, ఆర్ధిక మంత్రి జైట్లీ చేతులెత్తేశారు... చేద్దాం చూద్దాం, ఆయన్ని అడగండి, ఈయన్ను అడగండి అంటూ, తప్పించుకున్నారు...
జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశంలో ఇక మీదట ఏ రాష్ట్రాలకూ పన్నురాయితీలు కల్పించడం ఉండదని మీరు చెప్పినందునే మేం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాం. 22వ జీఎస్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీజీఎస్టీ, ఐజీఎస్టీని వాపసు ఇస్తున్నారు. అందువల్ల ఆ ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కచ్చితంగా కల్పించాల్సిందేనని...’’ యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జైట్లీ కొన్ని ఇబ్బందులను ఏకరువుపెట్టారు. అందుకు యనమల బృందం స్పందిస్తూ తామేం కొత్తగా ఏమీ అడగడంలేదని, ఈశాన్య రాష్ట్రాలకు ఏవైతే పన్ను రాయితీలిస్తారో అవి ఇస్తే చాలని స్పష్టం చేశారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించడానికి వాణిజ్యశాఖ తయారు చేసిన సర్క్యులర్ ఇప్పటికే కేబినెట్ సెక్రెటేరియట్‌కు వెళ్లిందని, అందులో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా చేర్చాలని యనమల కోరారు. అందుకు జైట్లీ స్పందిస్తూ తాను సురేష్ ప్రభుతో మాట్లాడి దీనిపై ఒక స్పష్టత ఇస్తానని చెప్పారు.
అలాగే, ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90% వాటా ఇచ్చినట్లుగానే మాకూ ఇస్తామని చెప్పినందున, ఇవ్వాల్సిన 30% తేడా మొత్తాన్ని దేశీయ ఆర్థిక సంస్థల నుంచి ఇప్పించాలని యనమల కోరారు. నాబార్డు ద్వారానో, హడ్కో ద్వారానో ఆ మొత్తాన్ని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ విధానమైతే బాగుంటుందో ఖరారు చేయండి, దాని ప్రకారం ఇస్తామని అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. ఇలా తీసుకొనే రుణం ఎవరి ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని తాను ఇదివరకే చెప్పానని, దానిపై మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అది కేంద్రమే చేయాలని ఏపీ బృందం చెప్పింది.