ప్రపంచంలోనే అతిపెద్ద రైస్ మిల్లును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పేందుకు దుబాయ్‌కు చెందిన ఫోనిక్స్(Phoenix) సంస్థ సన్నద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించి పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెడతామని ఫోనిక్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో గౌరవ్ థావన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అన్నారు. ఈ నెలాఖరులో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు వాణిజ్య–పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించడానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు గురువారం ఒకరోజు పాటు దుబాయ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రితో గౌరవ్ థావన్ సమావేశమయ్యారు.
మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టుపై ఇరువురు చర్చించారు. ఉక్రెయిన్‌లో అమెరికాకు చెందిన కొన్ని సంస్థల సహకారంతో తాము నెలకొల్పుతున్న ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందని, దీని తర్వాత భారత్ మార్కెట్‌పై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రికి థావన్ తెలిపారు. ఏపీలో వ్యవసాయరంగంలో అనుసరిస్తున్న వినూత్న విధానాల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించారు. అనంతపురము జిల్లాలో పెద్దఎత్తున వేరుశనగ సాగు చేపట్టేందుకు గల అవకాశాలు పరిశీలించాలని, వేరుశనగ నుంచి బటర్ తయారు చేసే యూనిట్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ భేటీలో ఫోనిక్స్ గ్రూపు ఫైనాన్స్ కంట్రోలర్ నితిన్ నవంథెర్ కూడా వున్నారు.
సామర్లకోటలో నెలకొల్పే రైస్ మిల్ ప్రాజెక్టు ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ప్రపంచంలోని అతిపెద్ద రైస్ మిల్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో లక్ష మెట్రిక్ టన్నులను దేశీయ మార్కెట్లో, మిగిలిన 2 లక్షల మెట్రిక్ టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని ఫోనిక్స్ సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 200 నుంచి 400 మందిగి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి దేశవిదేశాల్లో ఈ సంస్థ పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరుపుతోంది. సుమారు 11 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల మేర లావాదేవీలు జరుపుతోంది. పలు దేశాలలో భారీగా భూకమతాలు ఫోనిక్స్ గ్రూపు కలిగివుంది.